రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గు ఉత్పత్తి చేయాలి

13 Jul, 2014 04:00 IST|Sakshi
రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గు ఉత్పత్తి చేయాలి

సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య
భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గును ఉత్పత్తి చేసేందుకు అధికారులు, కార్మికులు కృషి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ సుతీర్థ భట్టాచార్య అన్నారు. భూపాలపల్లి ఏరియాలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును సందర్శించి అందులో మట్టి తవ్వకాల తీరుతెన్నులు, బొగ్గు ఉత్పత్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇసుక తయారీ కేంద్రానికి చేరుకుని మట్టి నుంచి ఇసుకను వేరు చేసే విధానాన్ని పరిశీలించారు. ఏరియాలో ఇసుక కొరత ఉన్న దృష్ట్యా భూగర్భ గనులకు సరిపడా ఇసుకను తయారీ చేయాలని చెప్పారు. తర్వాత స్థానిక అతిథి గృహంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు అందజేశారు.

చెల్పూరు కేటీపీపీ రెండో దశ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే మొదటి, రెండు దశలకు సరిపడా బొగ్గును అందించాలంటే ఏరియాలోని ఓపెన్‌కాస్ట్, తాడిచర్ల బ్లాక్ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూసేందుకు సింగరేణి తనవంతు పాత్ర పోషించాలని కోరారు. అధికారులు, కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకతను సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. సీఎండీ వెంట సంస్థ డెరైక్టర్లు విజయ్‌కుమార్, మనోహర్, రమేష్‌కుమార్, రమేష్‌బాబు, ఆయా విభాగాల అధికారులు, సీజీఎంలు, జీఎంలు ఉన్నారు.

మరిన్ని వార్తలు