కలెక్టర్ పరిధిలో కేసు.. తహసీల్దార్ తీర్పు!

19 Jun, 2014 00:03 IST|Sakshi
కలెక్టర్ పరిధిలో కేసు.. తహసీల్దార్ తీర్పు!

- బదిలీ అయిన తర్వాత తేదీలతో ఉత్తర్వులు
- కలెక్టర్ విచారణలో అక్రమాలు వెల్లడి
- చర్యకు వెనుకాడుతున్న జిల్లా యంత్రాంగం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తహసీల్దార్‌కు జిల్లా యంత్రాంగం వత్తాసు పలుకుతోంది. కలెక్టర్ పరిధిలో ఉన్న కేసుపై తీర్పు ఇవ్వడమేకాకుండా.. బదిలీ అయిన తర్వాత పాత తేదీలతో ఉత్తర్వులు జారీచేసిన సదరు అధికారిపై చర్య తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. శంషాబాద్‌లోని సర్వే నం.374, 621లలో 38ఈ సర్టిఫికెట్ జారీ చేయాలని కోరుతూ కొంతమంది స్థానిక తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చే శారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కేసును పరిష్కరించాలని గత ఏడాది సెప్టెంబర్‌లో జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

ఇదిలావుండగా, ఈ కేసు కలెక్టర్ పరిధిలో ఉన్న అంశాన్ని పట్టించుకోకుండా కేసును విచారించిన అప్పటి తహసీల్దార్ లచ్చిరెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 28న తీర్పును రిజర్వ్‌లో పెట్టారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో మూడేళ్లుపైబడి ఒకే జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లకు స్థానచలనం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ క్రమంలో లచ్చిరెడ్డి హైదరాబాద్ జిల్లాకు ఫిబ్రవరి 11న బదిలీ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. గతంలో విచారణ జరిపిన ఈ కేసుకు సంబంధించి అదేనెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన తహసీల్దార్... నిబంధనలకు విరుద్ధంగా గతంలో విచారించిన కేసుపై ఉత్తర్వులు జారీచేయడాన్ని గుర్తించిన దరఖాస్తుదారులు ఈ అంశాన్ని అప్పటి కలెక్టర్ బి.శ్రీధర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఫైల్‌ను మాయం చేయడమేకాకుండా.. ఉత్తర్వులను సైతం తన మెయిల్ ద్వారా తహసీల్దార్ కార్యాల యానికి పంపినట్లు ఆధారాలను జతపరిచారు. త న పరిధిలో ఉన్న కేసుపై తీర్పు వెల్లడించినట్లు తెలుసుకున్న కలెక్టర్ అవాక్కయ్యారు. తన వద్ద కేసు పెండింగ్‌లో ఉండగా ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన ఈ బాగోతంపై నివేదిక ఇవ్వాలని స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపిన అప్పటి తహసీల్దార్ రత్నకళ్యాణి దరఖాస్తుదారులు ఫిర్యాదుల్లో వెల్లడించిన వివరాలను ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను బదిలీ అయిన తర్వాత తన వెంట తీసుకెళ్లారని, దాన్ని 22న కార్యాలయానికి పంపారని, ఉత్తర్వులను సైతం తన వ్యక్తిగత మెయిల్ ద్వారా జారీ చేసినట్లు తేల్చారు.

 ఈ మేరకు తహసీల్దార్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన బి.శ్రీధర్.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ  జరపాలని జాయింట్ కలెక్టర్-2 ఎంవీరె డ్డిని ఆదేశించారు. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు పక్షం రోజులైనా ఎలాంటి పురోగతి లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ కలెక్టర్ పరిధిలో ఉన్న కేసు మాత్రమేకాకుండా... బదిలీ అయిన తర్వాతి తేదీల్లో ఉత్తర్వులు జారీ చేసిన ట్లు స్పష్టమైనా సదరు అధికారిపై చర్య తీసుకోకపోవడం ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడమేనని రెవెన్యూ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు