కడలి ఆమెకు నెచ్చెలి | Sakshi
Sakshi News home page

కడలి ఆమెకు నెచ్చెలి

Published Thu, Jun 19 2014 12:15 AM

కడలి ఆమెకు నెచ్చెలి - Sakshi

ఆమె సాగర సాహసి... అలలు ఆమె నేస్తాలు.. ఎక్కడి ఆస్ట్రేలియా! ఎక్కడి భారతదేశం! ఇంకెక్కడి జర్మనీ! నేలపైనే కలవరపెట్టే ఈ దూరాన్ని ఆమె కడలిలో అధిగమించింది. ఓ మామూలు తెడ్డు పడవలో ఒంటరి ప్రయాణం చేస్తూ దూరతీరాన ఉన్న ఆస్ట్రేలియా నుంచి ఆంధ్ర తీరానికి చేరుకుంది. సడలని సంకల్పంతో జర్మనీ దిశగా పురోగమిస్తోంది. మూడేళ్లుగా సాహస యాత్ర సాగిస్తున్న 41 ఏళ్ల శాండీ రాబ్సన్ ఉత్సాహం అబ్బుర పరుస్తోంది.
 
పాయకరావుపేట: శాండీ రాబ్సన్.. ఆస్ట్రేలియాకు చెందిన సామాన్య మహిళ.. 46 ఏళ్ల శాండీకి ప్రకృతి అంటే ప్రాణం.. అందునా కయాకింగ్ (తెడ్డు పడవపై ప్రయాణం) అంటే ఆమెకు అవధుల్లేనంత ఇష్టం. అందుకే ఆస్ట్రేలియా నుంచి జర్మనీ వరకు కయాక్‌తో చేరుకోవాలని ఆమె సంకల్పించారు. 2011 మే14న ఆస్ట్రేలియా తీరం నుండి యాత్రను ప్రారంభించిన ఆమె మూడేళ్లుగా ఎన్నో కష్టనష్టాలు తట్టుకుంటూ నిర్విరామంగా సాహస యాత్ర సాగిస్తున్నారు.

ఆంధ్ర తీరం వెంబడి పయనిసున్న శాండీ పెంటకోట లైట్‌హౌస్ ప్రాంతానికి మంగళవారం సాయంత్రం చేరుకున్నారు.  వారం క్రితమే ఇక్కడకు చేరుకోవాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనట్టు చెప్పారు. పెంటకోట తీర ప్రాంతంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడమే కాకుండా, కాస్త నలతగా ఉండడంతో విశ్రాంతి కోసం శాండీ తీరానికి చేరుకున్నారు. తాను ప్రత్యేకంగా తెచ్చుకున్న నెట్ ఏర్పాటు చేసుకుని లైట్‌హౌస్ వద్ద విశ్రమించారు. పెంటకోట మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు.

ఈసందర్భంగా శాండీ రాబ్సన్ విలేకరులతో మాట్లాడుతూ తన యాత్రలో సాగరతీరంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నాయి. ఒక్కో ప్రాంతాన్ని దాటుతూ  వస్తున్న తనను భారతీయులు ఎంతో ఆత్మీయంగా చూసుకుంటున్నారని చెప్పారు.

మచిలీపట్నం ప్రాంతంలో మాత్రం మత్స్యకారుల నుండి ఇబ్బందులు ఎదురయ్యాయని, కొందరు తన బోటుకు నష్టం కలిగించారని చెప్పారు. పగటి వేళ సాగరయాత్ర చేసి చీకటి పడే సమయానికి తీరంలో గ్రామాలకు చేరుకుని బస చేస్తున్నట్టు చెప్పారు. సముద్రంలో సాహస యాత్ర చేస్తున్న శాండీ రాబ్సన్‌ను చూసేందుకు  పెంటకోట ప్రాంతీయులు తరలి వచ్చారు.
 

Advertisement
Advertisement