ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి | Sakshi
Sakshi News home page

ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి

Published Thu, Jun 19 2014 12:16 AM

ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి - Sakshi

సిద్దిపేట అర్బన్ : ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పీడీఎస్‌యూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కమ్మంపల్లి యాదగిరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌతం ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయాలని కోరారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంధ విద్యను అందించాలన్నారు.
 
ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని అర్హులైన విద్యార్థులకు ఎలాంటి షరతులు లేకుండా వర్తింపజేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాలు సిండికెట్‌గా ఏర్పడి ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. సిద్దిపేట, దుబ్బాక. గజ్వేల్, రామాయంపేట పట్టణాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందన్నారు.
 
నియంత్రించాల్సిన అధికారులు పరోక్షంగా వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు, ల్యాబ్, అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకు లు వంటి వాటిని పరిశీలించాలన్నారు. నిబంధనలు పాటించని కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ నాయకులు సతీష్, శ్రావణ్, శ్రీకాంత్, స్వామి, వెంకట్, అనిల్, నరేష్, సందీప్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement