కరోనాపై కలెక్టర్లకు బాధ్యతలు

5 Feb, 2020 04:10 IST|Sakshi

జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలి

కలెక్టర్లకు వైద్య, ఆరోగ్యశాఖ లేఖ

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా కేసులు తీసుకోవద్దని ఆదేశాలు

ఏపీ అనుమానిత కేసులకూ గాంధీ ఆస్పత్రిలోనే నిర్ధారణ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాలను అప్రమత్తం చేసింది. జిల్లాల్లో కరోనా వైరస్‌ నియంత్రణ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. ఎవరైనా చైనా సహా సమీప దేశాల నుంచి వచ్చిన వారుంటే గుర్తించాలని, కరోనా రాకుం డా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేరళలో 3 కరోనా కేసులు నమోదు కావడం, అక్కడి ప్రభుత్వం కలెక్టర్లకు బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో అదే పద్ధతిలో తెలంగాణలోనూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే కరోనా అనుమానిత కేసులకు కూడా ఇకనుంచి హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలోనే నిర్ధారణ పరీక్షలు చేయిం చాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ఇక అక్కడి నుంచి వచ్చే కేసులకు గాంధీ ఆసుపత్రిలోనే నిర్ధారణ పరీక్షలు చేస్తామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ను జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. కరోనా, ఎబోలా వంటివి అనుకోకుండా వ్యాపిస్తే పరిస్థితిని నియంత్రించేలా ఇవి పనిచేస్తాయి. ఈ మేరకు ఆ టీమ్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చుకోవద్దు..
కరోనా అనుమానిత లక్షణా లతో వచ్చే వారిని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు ఏ మాత్రం అడ్మిట్‌ చేసుకోవద్దని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అటువంటివారు ఎవరైనా వస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యే కశ్రద్ధతో గాంధీ లేదా ఫీవర్‌ ఆసుపత్రికి పంపించాలని స్పష్టం చేసింది. ముక్కు కార డం, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలతో ఎవరు వచ్చినా వారి వివరాలు తెలుసుకోవా లని ప్రైవేటు ఆసుపత్రులకు సూచించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 777 విమానాల ద్వారా వచ్చిన 89,500 మందిని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ చేశారని, అందు లో 3,935 మందిని ఎటూ వెళ్లకుండా ఇళ్లలోనే ఉండిపోవాలని కేంద్రం ఆదేశించింది. 454 మంది కరోనా అనుమానితులను పరీక్షించగా, ముగ్గురికి కరోనా సోకినట్లు కేంద్రం ప్రకటించిందని డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

మన రాష్ట్రానికి ఇప్పటివరకు 42 మంది చైనా నుంచి వచ్చారన్నారు. వుహాన్‌ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిలో ఎవరికైనా లక్షణాలుంటే మాత్రమే పరీక్షలు చేయాలని, ఇతరులకు వద్దని నిర్ణయించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చైనాకు పంపిన విమానాల ద్వారా మన దేశానికి 600 మంది రాగా, అందులో రాష్ట్రానికి చెందినవారు ఐదుగురు ఉన్నారని అధికారులు వెల్లడించారు. జనవరి 15 తర్వాత చైనా నుంచి వచ్చిన వారి వివరాలు మాత్రమే సేకరించామని, ఇకనుంచి అంతకుముందు వచ్చిన వారి వివరాలు కూడా తీసుకోవాలని సూచించామన్నారు. వారిలోనూ ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా వైద్యాధికారులకు సూచిం చారు. కరోనా నిర్ధారణ పరీక్ష మూడు శాంపిళ్లను సేకరించడం ద్వారా చేస్తారన్నారు. గొంతు, ముక్కు, రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తారని తెలి పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేసియా దేశాలకు వెళ్లొద్దని వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది.

మరిన్ని వార్తలు