చేవెళ్లపై బీఆర్‌ఎస్‌ దృష్టి

26 Dec, 2023 01:13 IST|Sakshi
సమావేశానికి హాజరైన కేటీఆర్, సబిత, ఎంపీ రంజిత్‌ రెడ్డి తదితరులు

ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ భేటీ 

పార్లమెంట్‌ ఎన్నికల్లో వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం 

వచ్చే జనవరి 3వ తేదీ నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ప్రస్తుతమున్న సిట్టింగ్‌ ఎంపీ స్థానాలు చేజారకుండా కాపాడుకోవడంతోపాటు మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండాను రెపరెపలాడించాలని యోచిస్తోంది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, ప్రకా­శ్‌­గౌడ్, కాలే యాదయ్య, అరికెపూడి గాందీలతోపాటు మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో సమావేశం అయ్యారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే ఆయా అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. చేవెళ్ల ఎంపీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు పొందిన ఓట్ల కంటే 1.85 శాతం ఓట్లు మాత్రమే బీఆర్‌ఎస్‌కు తక్కువగా వచ్చాయి.

పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో కొద్దిగా శ్రమిస్తే మళ్లీ చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేయొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించడంతో పా­టు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలకు అభ్యర్థి ఖరారు, ప్రచారం, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్‌ వారికి దిశానిర్దేశం చేశారు. మండలాలవారీగా సమీక్ష స­మా­వేశాలు ఏర్పాటు చేసి, జనవరి మూ­డు నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు.  

మళ్లీ టికెట్‌ నాకే: ఎంపీ రంజిత్‌రెడ్డి  
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకే మళ్లీ టికెట్‌ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించిందని, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం ప్రచారానికి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌కూడా ఇచి్చనట్టు సోమవారం మీడియా ముఖంగా ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. జనవరి 3వ తేదీ నుంచి ఎంపీ సెగ్మెంట్‌ పరి«ధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తానని చెప్పారు.  

అసలు వీళ్లు మంత్రులేనా? 
కర్ణాటక మంత్రి కరువు వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఆగ్రహం 
సాక్షి, హైదరాబాద్‌: రుణమాఫీ కోసం ఏటా కరువు పరిస్థితులు ఏర్పడాలని రైతులు కోరుకుంటారని కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రి శివానంద పాటిల్‌ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ ద్వారా స్పందించారు. ‘అసలు వీళ్లు మంత్రులేనా.. రైతులపై ఇలాంటి హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో తమకు ప్రభుత్వం సానుభూతితో అండగా ఉండాలని మాత్రమే రైతులు కోరుకుంటారు’.. అని కేటీ రామారావు వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు