భారీగా చేరి.. బారులు తీరి..!

26 Dec, 2023 01:43 IST|Sakshi
మెదక్‌ చర్చి ఎదుట భక్తుల సందడి

మెదక్‌ చర్చిలో వైభవంగా క్రిస్మస్‌ వేడుకలు

సుమారు 3 లక్షలమంది వచ్చినట్లు అంచనా

మెదక్‌: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ సీఎస్‌ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్‌ సంబరాలు వైభవంగా జరిగాయి. మెదక్‌ పట్టణంలోని సుమారు 600 ఎకరాల చర్చి ప్రాంగణం జనంతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి మూడులక్షల మంది భక్తులు తరలివచ్చారని అంచనా. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి.

చలితీవ్రతను కూడా లెక్కచేయకుండా భక్తులు యేసయ్య దీవెనల కోసం బారులుతీరారు. ఈ సందర్భంగా బిషప్‌ కె.పద్మారావు దైవసందేశం ఇచ్చారు. శాంతిద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ క్రీస్తును ఆరాధించాలని, విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రతిసమస్యకూ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.

ప్రభువు చూపిన మార్గంలో నడుస్తూ సుఖసంతోషాలతో విరాజిల్లాలంటూ ప్రార్థనలు చేశారు. అంతకుముందు చర్చి వందో యేటా అడుగు పెట్టిన సందర్భంగా రూపొందించిన కేలండర్‌ను ఆవిష్కరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి

‘కల్వరి’లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు 
హఫీజ్‌పేట్‌(హైదరాబాద్‌): మియాపూర్‌ కల్వరి టెంపుల్‌లో సోమవారం వైభవంగా క్రిస్మస్‌ వేడుకలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు మూడు లక్షలమంది భక్తులు తరలివచ్చి యేసుక్రీస్తు ప్రార్థనలు చేశారు. కల్వరి టెంపుల్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ సతీశ్‌కుమార్‌ భక్తులకు క్రీస్తు జననం గురించి వివరించి, ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా క్రీస్తు నాటక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. టెంపుల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల క్రిస్మస్‌ ట్రీ ఆకట్టుకుంది. దీంతో ట్రీ వద్ద సందర్శకులు పెద్దఎత్తున ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు.

>
మరిన్ని వార్తలు