సర్వేనే దిక్సూచి!

24 Nov, 2018 05:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సమగ్ర కుటుంబ సర్వే టీఆర్‌ఎస్‌కు ఎన్నికల ఆయుధమైంది. సర్వే వివరాల ఆధారంగానే ఆయా వర్గాలకు పలు రకాల హామీలిస్తోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ పార్టీ గెలుస్తుందన్న చర్చ ఊపందుకుంది. ఇదే సమయంలో తమ విజయావకాశాలపై టీఆర్‌ఎస్‌ ధీమాగా ఉంది. స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారం కైవసం చేసుకుంటామని కారు పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఒక కారణమైతే.. తన చేతిలో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే మరో కారణమని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన కొద్దినెలలకే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రం లోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వైవిధ్యతపై స్పష్టత కోసం ఈ సర్వే చేపట్టారు. దీనిపై చాలా ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ సర్వే తరువాత కారు పార్టీ ప్రతి ఎన్నికలోనూ విజయం సాధిస్తూ టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. 

మెదక్‌ పార్లమెంట్‌ ఉపఎన్నికతో మొదలు 
2014 ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌ అసెంబ్లీ స్థానంతోపాటు మెదక్‌ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి రెండుచోట్లా విజయం సాధించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో మెదక్‌ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సరిగ్గా మెదక్‌ ఉపఎన్నికకు ముందు కేసీఆర్‌ సమగ్ర కుటుంబసర్వే చేపట్టారు. దీని ఆధారంగా భవిష్యత్తులో వివిధ సంక్షేమ పథకాలు చేపడతానని అప్పట్లో ప్రకటించారు. మెదక్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. 2015లో కడియం శ్రీహరి వరంగల్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలిచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 150 డివిజన్లలో  99 స్థానాలు కైవస ం చేసుకుంది. తరువాత నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకస్మిక మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భూపాల్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇలా అన్ని పురపాలక, నగరపాలికల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగిస్తూ వస్తోంది.

సర్వేనే ఆయుధమా?
వాస్తవానికి నారాయణఖేడ్, పాలేరులో కాంగ్రెస్‌కు బలం ఎక్కువ. పైగా సానుభూతి కలసి వస్తుందనుకున్న కాంగ్రెస్‌కు రెండు సందర్భాల్లోనూ పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు సమగ్ర కుటుంబ సర్వేపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో ఏ ఏ వర్గాల వారు నివసిస్తున్నారు... వారి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు, ఆ ప్రాంత భౌగోళిక స్థితులు, అవసరాలేమిటి... వంటి వాటిని గ్రహించి టీఆర్‌ఎస్‌ తన వ్యూహాలను రచిస్తోంది. ఆ మేరకు ప్రచార ప్రణాళికలను రూపొందిస్తోంది. ఎక్కడ ఎవరు ప్రచారం చేయాలి? ఏ ఏ విషయాలు మాట్లాడాలన్న దానిలోనూ సర్వేనే ఆధారం. టీఆర్‌ఎస్‌ ముందస్తుకు వెళ్లేందుకు కారణం కూడా ఇదేనని విశ్వసనీయ సమాచారం. సంక్షేమ పథకాలతోపాటు సమగ్ర కుటుంబసర్వే ఈ ఎన్నికల్లో తమను గట్టెక్కిస్తుందని కేసీఆర్‌ ధీమాతో ఉన్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు