విద్య పట్ల ఆసక్తిని పెంచడానికే...

28 Apr, 2015 04:40 IST|Sakshi

నందిగామ(కొత్తూరు): విద్యా పట్ల మరింత ఆసక్తిని పెంచడానికే ప్రభుత్వం విద్యార్థులకు వేసవి తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై వేసవి తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అమె మాట్లాడుతూ.. ఎండల్లో తిరగకుండా విద్యార్థులు చక్కగా తరగతులకు హాజరు కావాలన్నారు.

వచ్చే విద్యా సంవత్సరంలో ఉండే పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు వేసవి తరగతుల్లో భాగంగా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధించడం జరుగుతుందన్నారు. తద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించి అంతకు ముందు తరగతుల్లో బీసీ గ్రేడుల్లో ఉంటే మరింత రాణిస్తారని తెలిపారు. అనంతరం డీఈవో నాంపల్లి రాజేష్ మాట్లాడుతూ.. వేసవి తరగతులు నిర్వహించే ఉపాధ్యాయులకు ఇది వరకే శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఆటపాటల ద్వారా ఆహ్లాదకరంగా ఉపాధ్యాయులు బోధిస్తారని తెలిపారు. వేసవి తరగతులు 33 మూడు రోజులు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు.

తరగతుల నిర్వహణకు స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ ఈటా గణేష్, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్లు కిష్టయ్య, రత్నం, నాయకులు ఆల్వాల వెంకటయ్య, జహీరోద్దిన్, జంగయ్య, సురేష్, ఆశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ, తహశీల్థార్ నాగయ్య, ఇన్‌చార్జీ ఎంఈవో రాఘవారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు స్వాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు