వీళ్లకు ఇబ్బందేనా?

10 Oct, 2018 11:12 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:   సాధారణ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఓడిపోయినా.. ప్రత్యర్థుల చేతిలో 30 వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలైనా.. గత ఎన్నికల్లో 25 వేల కంటే తక్కువ ఓట్లు వచ్చినా.. ఆయా అభ్యర్థులకు ఈ సారి టికెట్‌ ఇచ్చేది లేదని కాంగ్రెస్‌ పార్టీ స్వీయ మార్గదర్శకాలను రూపొందించుకుంటోంది. టీపీసీసీ ఎన్నికల కమిటీ ఏర్పాటైన తర్వాత  నాలుగు రోజుల కిందట  జరిగిన ప్రాథమిక భేటీలో పై అంశాలు చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదే కమిటీ మరిన్ని సార్లు సమావేశమై టికెట్ల ఖరారుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను ఆమోదించనుంది. ఇవే నిబంధనలు నూటికి నూరుపాళ్లు అమలు చేస్తే  కాంగ్రెస్‌ పార్టీలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలకు టికెట్లు దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టికెట్ల రేసులో ముందంజలో ఉన్న పొన్నాల లక్ష్మయ్య, విజయరామారావు, డాక్టర్‌ రామచంద్రనాయక్‌తోపాటు వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఎర్రబెల్లి స్వర్ణకు ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
 
పొన్నాల పరిస్థితి ఏంటో ..! 
గత ఎన్నికలల్లో జనగామ నియోజకవర్గం నుంచి పోటీచేసిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన తన సమీప ప్రత్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో 32,695 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సుదీర్ఘకాలం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి రికార్డు సాధించిన ఆయన తపాసుపల్లి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ ప్రజలు మద్దతు తెలపలేదు. 2014 ఎన్నికల్లో  జనగామ నియోజకవర్గంలో మొత్తం 1,70,930 ఓట్లు పోల్‌ కాగా.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి 84,074 ఓట్లు, పొన్నాల లక్ష్మయ్యకు 51,379 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ నిబంధనలు కఠినంగా అమలు చేస్తే లక్ష్మయ్యకు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన టీపీసీసీ ఎన్నికల కమిటీలోనూ,  ఎన్నికల మేనిఫెస్టో కమిటీలోనూ సభ్యుడిగా ఉండటంతో పాటు సుధీర్ఘకాలంగా మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో లక్ష్మయ్యకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

55 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి..
స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ రేస్‌లో ముందున్న మాజీ మంత్రి విజయరామారావుకు ఈ నిబంధనలు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇక్కడ  తాటి కొండ రాజయ్య హ్యాట్రిక్‌ సాధించారు.  రాజయ్య చేతిలో ఆయన 58,829 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకర్గంలో మొత్తం 1,79,052 ఓట్లు పోల్‌ కాగా, తాటికొండ రాజయ్యకు అత్యధికంగా 1,03,662 ఓట్లు వచ్చాయి.  కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన విజయరామారావు 44,833 ఓట్లతోనే సరిపెట్టుకున్నారు.

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి స్వర్ణ మరోసారి టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌ చేతిలో 56,374 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ మొత్తం 1,40,788 ఓట్లు పోల్‌ కాగా.. స్వర్ణకు కేవలం 27,188 ఓట్లు వచ్చాయి.

డోర్నకల్‌లో డిపాజిట్‌ నిబంధన..
గత ఎన్నికల్లో డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ–బీజేపీ కూటమి తరఫున డాక్టర్‌ రామచంద్రనాయక్‌ పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన డోర్నకల్‌ టికెట్‌ రేసులో హాట్‌ ఫెవరేట్‌గా ఉన్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయనకు 8,384 ఓట్లు మాత్రమే వచ్చాయి.  డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఇక్కడ మొత్తం 1,64,352 ఓట్లు పోల్‌ కాగా.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన రెడ్యానాయక్‌కు అత్యధికంగా 84,170 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ స్వీయ నిబంధనలు రామచంద్రనాయక్‌కు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

వర్ధన్నపేటలో కొండేటి శ్రీధర్‌కు.. 
వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కొండేటి శ్రీధర్‌కు ఇబ్బందిక పరిస్థితులే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరూరి రమేష్‌ చేతిలో 86,349 ఓట్ల  తేడాతో ఓడిపోయారు. ఇక్కడ మొత్తం 1,77,745 ఓట్లు పోల్‌ కాగా.. కొండేటి శ్రీధర్‌కు 30,905 ఓట్లు మాత్రమే వచ్చాయి. రమేష్‌కు అత్యధికంగా 1,17,254 ఓట్లు పోలయ్యాయి. తన కు మరో అవకాశం ఇవ్వాలని టీపీసీసీకి శ్రీధర్‌ దరఖాస్తు చేసుకున్నారు. స్క్రీనింగ్‌ కమిటీ కూడా ఆయన అభ్యర్థనను పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే 86 వేల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో పార్టీ వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. 

గెలుపు గుర్రాల కోసం వడపోత..
టికెట్ల ఖరారుకు సంబంధించి ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్‌ కమిటీ ఈ నెల 10, 11, 12, 13వ తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనుంది. గెలుపు గుర్రాల కోసం వడపోత చేపట్టనుంది. టీ పీసీసీ ఎన్నికల కమిటీ ఇచ్చిన 1:3 జాబితాను వడపోసిన అనంతరం 15వ తేదీలోపు ప్రతి నియోజకవర్గానికి ఒకరు  లేదా ఇద్దరి పేర్లతో ఏకే ఆంటోనీ నేతృత్వంలోని జాతీయ ఎన్నికల కమిటీకి జాబితా ఇవ్వనుంది. అక్కడ తుది నిర్ణయం తీసుకుని 15వ తేదీ నుంచి 20వ తేదీలోపు  కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు