కాంగ్‌‘రేసు’లో పోటాపోటీ

10 Mar, 2019 10:24 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం : మహబూబాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కోసం రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ రానంతగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రధానంగా నలుగురు మాత్రమే టికెట్‌ కోసం పోరాడుతున్నారు. ఈ స్థానం నుంచి బరిలో దిగడానికి పీసీసీకి 44 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ మరికొందరు నేరుగా ఢిల్లీ వెళ్లి దరఖాస్తు చేసుకుంటుండడం గమనార్హం. ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అప్లికేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 380 మంది అప్లై చేసుకున్నారు. అయితే ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం

వహించిన కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, రాష్ట్ర నాయకుడు తేజావత్‌ బెల్లయ్యనాయక్, టీపీసీసీ సభ్యుడు చీమల వెంకటేశ్వర్లు రేసులో ముందంజలో ఉన్నారు. కాగా, స్థానికేతరులకు, గతంలో ఓడిపోయిన వారికి టికెట్‌లు ఇవ్వవద్దని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే జరిగితే మానుకోటకు స్థానికేతరుడైన రాములునాయక్, గత లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్‌ ఎంపీగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన బలరాంనాయక్‌కు టికెట్లు రావడం అనుమానమేననే చర్చ సాగుతోంది.  

42 మంది బంజారా నాయకులే..  
మానుకోట ఎంపీ టికెట్‌ కోసం టీపీసీసీ ఇచ్చిన గడువులోగా 44 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 42 మంది బంజారా సామాజిక వర్గానికి చెందినవారు కాగా, కోయ సామాజిక వర్గం నుంచి చీమల వెంకటేశ్వర్లు, మోకాళ్ల శ్రీనివాసరావు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. చీమల పీసీసీకి దరఖాస్తు చేయడానికి ముందే ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌కు దరఖాస్తు అందజేశారు. ఢిల్లీలోనే మకాం వేసిన టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇల్లెందు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. అయితే చీమలకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) మద్దతు ప్రకటిస్తున్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ సైతం చీమలకు మద్దతు తెలిపే అవకాశాలు  ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్న పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా చీమలకు గతంలోనే మద్దతు ప్రకటించారు.  

అత్యధిక ఎమ్మెల్యేలు గెలవడం వల్లే..  
మహబూబాబాద్‌ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో (పినపాక, ఇల్లెందు, భద్రాచలం, ములుగు) కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. వీటిలో పినపాక, భద్రాచలం, ములుగు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మెజారిటీ బాగానే వచ్చింది.  ములుగు నియోజకవర్గంలో 22,650 ఓట్లు, పినపాకలో 19,565, భద్రాచలంలో 11,785, ఇల్లెందు నియోజకవర్గంలో 2,907 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట సెగ్మెంట్లలో మాత్రమే టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌ టికెట్‌కు డిమాండ్‌ మరింతగా పెరి గింది. మొత్తం ఏడు సెగ్మెంట్లలో నాలుగు గెలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా కష్టపడితే మహబూబాబాద్‌ లోక్‌సభ సీటును ‘హస్త’గతం చేసుకోవచ్చని అంచనాలు వేసుకుంటోంది. కాగా రాష్ట్రంలోని మరో ఎస్టీ రిజర్వుడు లోక్‌సభ స్థానం ఆదిలాబాద్‌తో మహబూబాబాద్‌ టికెట్‌ అంశం ముడిపడి ఉంది. ఈ రెండు స్థానాల్లో ఒకటి ఆదివాసీలకు కేటాయిస్తే, మరొకటి బంజారాలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ఈ సీటు కోసం భారీగా దరఖాస్తులు రావడం గమనార్హం. గత శాసనసభ ఎన్నికల సమయంలో నామినేషన్ల దాఖలు గడువు ముగిసే చివరి రోజు వరకు కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను విడతలవారీగా ప్రకటిస్తూ వచ్చింది. దీంతో గెలవగలిగిన అనేక సీట్లను కోల్పోయామని ఆ పార్టీ భావిస్తోంది. ఈ అనుభవం దృష్ట్యా లోక్‌సభ ఎన్నికలకు సాధ్యమైనంత ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఈ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మిక కుటుంబాలు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, ఆదివాసీల పోడు భూముల అంశం గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడంతో  టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తాకింది. పైగా ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. దీంతో తమకు ఇదే మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తోంది.

మరిన్ని వార్తలు