ఇదో అందమైన దోపిడీ

17 Nov, 2018 10:23 IST|Sakshi

మైనార్టీ బ్యూటీషియన్‌ కోర్సుల్లో నిధుల పక్కదారి  

100 మందికి శిక్షణనిచ్చి 300 మందికి నిధుల చెల్లింపు

సాక్షి,సిటీబ్యూరో: నిరుద్యోగ మైనార్టీ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణనిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా కార్పొరేషన్‌లోని కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి నిధులను బొక్కేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏటా మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా పలు వృత్తివిద్యా కోర్సుల్లో యువతకు శిక్షణ ఇస్తారు. గత రెండేళ్లుగా పేద యువతులకు ఓ సంస్థ ద్వారా బ్యూటీషియన్‌ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ ఏడాది 300 మందికి యువతులకు శిక్షణనిచ్చి నట్టు చెబుతున్నారు. కానీ సదరు సంస్థలో శిక్షణ పొందించి మాత్రం 100 మంది మాత్రమేనని ఆరోపణలున్నాయి. 

సరైన పరికరాలు లేని సంస్థలో శిక్షణ
కార్పొరేషన్‌ ద్వారా ఉపాధి శిక్షణ ఇచ్చే సంస్థకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి. లేదా కనీసం ఆ సంస్థకు శిక్షణలో పదేళ్ల అనుభవమైనా ఉండాలి. కానీ ఈ బ్యూటీషియన్‌ శిక్షణ సంస్థ విషయంలో  అధికారులు నిబంధనలేవీ పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఆ సంస్థ వద్ద అత్యాధునిక పరికరాలు ఉన్నాయా? ట్రైనర్స్‌  ఎంత మంది ఉన్నారు? గతంలో ఆ సంస్థలో ఎంత మంది శిక్షణ పొందారు? తదితర విషయాలేవీ పట్టించుకోకుండానే అనుమతి ఇచ్చేశారని తెలిసింది. పైగా శిక్షణ సమయంలో అసలు ఉన్నతాధికారులు ఆ సంస్థను ఒక్కసారైనా తనిఖీ చేయలేదని శిక్షణ పొందిన వారు వాపోతున్నారు.  
ఒకొక్కరికి రూ.15 వేలు చెల్లింపు.. బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ పొందిన ఒక్కో యువతిపై మైనార్టీ కార్పొరేషన్‌ రూ.15 వేలు చొప్పున ఖర్చు చేసింది. వాస్తవానికి బయట ఎక్కడైనా బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ పొందింతే కాలపరిమితిని బట్టి మూడు నెలలకు రూ.5 వేలు, ఒకటి, రెండు నెలలు అదనంగా ఉంటే రూ. 8 వేలకు తీసుకుంటారు. అయితే కార్పొరేషన్‌ సదరు శిక్షణ సంస్థకు రూ.15 వేలు ఎందుకు చెల్లించిందనే అంతుచిక్కని ప్రశ్న. 

పూర్తి వివరాలు తెలుసుకుంటాం
నేను బాధ్యతలు చేపట్టడానికి ముందునుంచే బ్యూటీషియన్‌ శిక్షణ కొనసాగుతోంది. ఇంతకుముందు ఉన్న ఎండీ హయాంలోనే శిక్షణ సంస్థ ఎంపిక, ఫీజు చెల్లింపు నిర్ణయాలు జరిగాయి. నేను ఇంత వరకు సంస్థను సందర్శించలేదు. శిక్షణ వివరాలు తెలుసుకుంటాను. ఏమైనా అవకతవకలు జరిగితే వారిపై చర్యలు తీసుకుంటాను.– మహ్మద్‌ వహీద్, మైనారిటీ కార్పొరేషన్‌ ఎండీ 

మరిన్ని వార్తలు