కంప్యూటర్ విద్యకు ‘వైరస్’

13 Jul, 2014 00:55 IST|Sakshi
కంప్యూటర్ విద్యకు ‘వైరస్’

ఘట్‌కేసర్ టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్యకు వైరస్ సోకింది. చదువుతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య నీరుగారుతోంది. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు, ఫర్నిచర్ ఎందుకూ పనికి రాకుం డా పోతున్నాయి. 2014లోనైనా కంప్యూటర్ విద్యకు మోక్షం కలుగుతుందనుకున్న విద్యార్థుల ఆశలు అడియాశలవుతున్నాయి. సర్కారు అనాలోచిత నిర్ణయాలవల్ల జిల్లాలో సుమారు 190 ఉన్నత పాఠశాలల్లో వేలాది విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు.

 అందని ద్రాక్షలా కంప్యూటర్ విద్య..
 ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే సంకల్పంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సక్సెస్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఐదేళ్లపాటు కంప్యూటర్ విద్యను బోధించడానికి ప్రైవేటు ఏజన్సీలతో రాజీవ్ విద్యామిషన్ ఒప్పందం కుదుర్చుకుంది. పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లను నియమించిన రెండు, మూడు సంవత్సరాల అనంతరం నిర్వాహణను గాలికొదిలేయడంతో కంప్యూటర్ విద్య అందని ద్రాక్షలా తయారయింది. ఏజన్సీల గడువు గతేడాది సెప్టెంబర్‌తో ముగియడంతో కంప్యూటర్ విద్య అటకెక్కింది. ఫాకల్టీని నియమించకపోవడం, పనిచేసిన వారికి సక్రమంగా వేతనాలను చెల్లించకపోవడంతో పూర్తిస్థాయి లో వారు పనిచేయకపోవడంతో విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందుకోలేకపోయారు.

 దుమ్ము ధూళితో మూలనపడ్డ కంప్యూటర్లు..
 వేతనాలను సక్రమంగా చెల్లించపోవడంతో ఇన్‌స్ట్రక్టర్లు విధులకు రావడం మానేశారు. దీంతో కోట్లాది రూపాయలను వెచ్చించి కొనుగోలుచేసిన కంప్యూటర్లు పాడయిపోయి మూలనపడ్డాయి. దీంతో నిర్వాహణ లేక కంప్యూటర్ గదులన్నీ దుమ్ము, ధూళితో నిండిపోయాయి. సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు కంప్యూటర్ పరి జ్ఞానం అందించాలన్న ఆశయం మంచి దైనా.. నిర్వహణ, పర్యవేక్షణ కొరవడి కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతోంది.

 మొదట ఇచ్చిన ఏజన్సీల కాలపరిమితి ముగిసిందని, పాఠశాలల్లో సాంకేతిక విద్యపై అవగాహన ఉన్న ఇతర ఉపాధ్యాయులతో బోధిం చాలని జిల్లాలోని ప్రధానోపాధ్యయులందరికీ తెలిపినట్లు జిల్లా డిప్యూటీ విద్యాధికారిని ఉషారాణి తెలిపారు. ఇప్పటికైనా స్పందించి ఉన్న కంప్యూటర్లతో సర్కారే స్వయంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు