పశువులకు అడ్డాగా రహదారులు 

1 May, 2018 08:47 IST|Sakshi
రోడ్లపై తిరుగుతున్న పశువులు

భద్రాచలంఅర్బన్‌ : భద్రాచలం పట్టణంలో పశువులు ప్రధాన రహదారులపైనే సంచరిస్తూ.., ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొంత మంది పశువులను ఇలా రోడ్డుపై వదిలేయడంతో రోడ్లపైనే సేద తీరుతున్నాయి. బస్టాండ్‌ నుంచి అంబేడ్కర్‌ సెంటర్, అదే విధంగా చర్ల, కూనవరం రోడ్డులో పదుల సంఖ్యలో పశువులు కూర్చుంటున్నాయి. పశువులు రోడ్డుపైనే ఉండడంతో పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవలే రోడ్లుపై సంచరిస్తున్న ఆవుదూడను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. పాత మార్కెట్‌ ఏరియాలో మిగిలిపోయిన కూరగాయలు రోడ్ల వెంట పడేడంతో ఆ ప్రాంతంలో కూడా పశువులు సంచరిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి. పశువులను ఉంచేందుకు గతంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.3.50 లక్షల వ్యయంతో బందెలదొడ్డి నిర్మించారు.

ఇప్పుడు ఆ బందెలదొడ్డి వృథాగా పడివుంది. బందెల దొడ్డి వేలం కనీస ధరను రూ.45 వేలుగా నిర్ణయించారు. దీన్ని తగ్గిస్తే పాటదారులు ముందుకు వచ్చే అవకాశముందని పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.

పరిష్కరిస్తాం.. 

రోడ్లు మీద సంచరిస్తున్న పశువులను ఉంచేందుకు బందెల దొడ్డి నిర్మించాం. కానీ ఈ సంవత్సరం నిర్వహించిన వేలం పాటలో ఎవరు ముందుకు రాలేదు. కనీస ధరను తగ్గించే విషయంలో పునరాలోచన చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతాం. – శ్రీనివాసరావు, పంచాయతీ ఈఓ

ఇబ్బందిగా ఉంది.. 

నిత్యం రోడ్లపైన పశువుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి పగులు తేడా లేకుండా రోడ్లపైనే తిరుగుతున్నాయి. వాటి వల్ల ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి కింద పడుతున్నాం. తగిన చర్యలు తీసుకోవాలి. – జి.రామకృష్ణ, ద్విచక్ర వాహనదారుడు

మళ్లీ మళ్లీ వస్తున్నాయి

రాత్రి వేళ ఈ పశువులు ఇక్కడే మా దుకాణాల ముందు పడుకుంటున్నాయి. ఎంత తోలినా మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తూ మా వ్యాపారాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. వాటి కోసం ఏర్పాటు చేసిన బందెల దొడ్డిలో ఉంచితే బావుంటుంది. అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. – బి.ఫణిబాబు వ్యాపారి  

మరిన్ని వార్తలు