కర్ఫ్యూ వంద శాతం అమలు చేస్తాం

24 Mar, 2020 01:16 IST|Sakshi

నిత్యావసరాలను పగలే కొనుక్కోవాలి

వస్తువుల ధరలు పెంచితే కఠిన చర్యలు

ఇంటి నుంచి 3 కి.మీ. వరకే వాహనాలకు అనుమతి

నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు, ఆటోలు సీజ్‌

లాక్‌డౌన్‌ ముగిశాకే యజమానులకు తిరిగి అప్పగిస్తాం

వ్యవసాయ, ఉపాధి హామీ పనులకు అనుమతి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ లాక్‌డౌన్‌లో భాగంగా ఈ నెల 31 వరకు ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు 100 శాతం కర్ఫ్యూ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా బయట కనిపిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. కోవిడ్‌–19 నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో సీఎస్, డీజీపీ మాట్లాడారు. కర్ఫ్యూ సమయంలో కిరాణా దుకాణాలు, కూరగాయల దుకాణాలు, పెట్రోల్‌ బంకులను సైతం మూసేయాలని ఆదేశించామని సీఎస్‌ వెల్లడించారు.

అత్యవసర వైద్య సేవల కోసం మాత్రమే రాత్రి వేళల్లో బయటకు అనుమతిస్తామని, ఇళ్లకు వెళ్లేందుకు ఆలస్యమైందని చెప్పినా అనుమతించే ప్రసక్తే లేదన్నారు. నిత్యావసర సరుకులతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం పగటివేళల్లో ఇంటికొకరిని మాత్రమే బయటకు అనుమతిస్తామన్నారు. అది కూడా ఇంటి నుంచి 3 కి.మీ. పరిధిలోని కిరాణా దుకాణాల నుంచే నిత్యావసరాలు కొనుక్కోవాలని, అంతకుమించి దూరం వెళ్లడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఒకేచోట ఐదుగురికి మించి గుమికూడటానికి అనుమతి లేదన్నారు. ఎవరైనా ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్‌ స్పష్టం చేశారు. ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ సోమవారం ఉదయం ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపై వాహనాల్లో తిరుగుతూ ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించడంపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లపై ఆటోలు కనిపిస్తే ఎక్కడికక్కడ జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని, అవసరమైతే ఆంక్షలను కఠినతరం చేస్తామని, ప్రజలు సిద్ధమై ఉండాలన్నారు. పరిస్థితులు అదుపులోకి వస్తే సడలింపు ఇస్తామని చెప్పారు. (కరోనాపై భయాందోళలు తొలగించాలి : మోదీ)


వ్యవసాయ పనులకు మినహాయింపు...
గ్రామాల్లో వ్యవసాయం, పండ్లు, కూరగాయాల సాగుతోపాటు ఉపాధి హామీ పనులకు మినహాయింపు కల్పించామని నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సైతం యథావిధిగా కొనసాగుతాయని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ స్పష్టతనిచ్చారు. లాక్‌డౌన్‌లో భాగంగా రాష్ట్ర సరిహద్దులు మూసేశామన్నారు. ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాల ప్రవేశం నిలిచిపోయిందన్నారు. రాష్ట్రానికి అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలకు మాత్రమే మినహాయింపు కల్పించామన్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన వారు హోం క్వారెంటైన్‌లో ఉండకుండా బయట కనిపిస్తే తీవ్ర చర్యలుంటాయని సీఎస్‌ హెచ్చరించారు. తక్షణమే వారిని ప్రభుత్వ క్వారెంటైన్‌ కేంద్రానికి తరలించడంతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.అత్యవసర పనుల కోసమే ఐటీ కంపెనీలు తమ కార్యాలయాల్లో ఉద్యోగులతో పనిచేయించుకోవడానికి అనుమతించామన్నారు.

ఇక కఠిన చర్యలు..
కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని లాక్‌డౌన్‌ అమల్లో పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలిచ్చామన్నారు. ఆంక్షలను కఠినంగా అమలు చేయకపోతే కవిడ్‌–19 వ్యాప్తిని అరికట్టలేమన్నారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా సోమవారం ఉదయం ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కఠిన నిర్ణయాలు అమలు చేయక తప్పదన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారని, కఠినంగా అమలు చేయడంలో విఫలమైన దేశాల్లో కోవిడ్‌–19 మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. (మహమ్మారిపై మహాపోరు)


చెక్‌పోస్టుల ద్వారా రాకపోకల నియంత్రణ...
ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో చెక్‌పోస్టులు పెట్టి పగటిపూట ప్రైవేటు వాహనాల రాకపోకలను నియంత్రిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. రోడ్డుపైకి వచ్చే ప్రతి వ్యక్తి అత్యవసర సరుకుల కోసమే వస్తున్నాడా? ఎంత దూరంలో అతని ఇల్లు ఉంది? అని పోలీసులు అడిగి తెలుసుకుంటారన్నారు. ఆంక్షలను ఉల్లంఘించినట్లు తేలితే వాహనాలను జప్తు చేసుకుంటామని, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాతే యజమానులకు తిరిగి అప్పగిస్తామన్నారు.

టూవీలర్‌పై ఒకరే.. కార్లో ఇద్దరు
ఒక ద్విచక్రవాహనంపై ఒకరే ప్రయాణించాలని, కారులో సైతం సెల్ఫ్‌ డ్రైవింగ్‌ అయితే ఒకరు, డ్రైవర్‌ ఉంటే ఇంకొకరిని మాత్రమే అనుమతిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ఆటోలు రోడ్లపైకి రావొద్దని, ఈ విషయంలో సహకరించాలని ఆటో డ్రైవర్ల యూనియన్లను కోరామన్నారు. లేనిపక్షంలో జప్తు చేసుకుంటామన్నారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారితోపాటు సడలింపులుగల వ్యక్తులనే దూరప్రాంతాలకు అనుమతిస్తామన్నారు. అంటురోగాల నియంత్రణ చట్టం కింద అధికారులకు ప్రభుత్వం అన్ని రకాల అధికారాలు కట్టబెట్టిందని, ఎవరైనా ఉల్లంఘనలను పునరావృతం చేసినట్లు తేలితే వారిపై కేసులు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్లపైకి వచ్చే వ్యక్తులకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించామన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయాల ధరలను పెంచి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) జితేందర్‌ పాల్గొన్నారు.  

‘కోవిడ్‌’పై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు 
రాష్ట్రంలో కోవిడ్‌–19 వైరస్‌ నియంత్రణకు వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకుంటున్న చర్యలను సమన్వయపరచడానికి సీనియర్‌ ఐఏఎస్‌లు అనిల్‌ కుమార్, రాహుల్‌ బొజ్జాలతో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సోమవారం ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేశారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అనిల్‌ కుమార్, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాహుల్‌ బొజ్జా కంట్రోల్‌ రూమ్‌లో సేవలందించనున్నారు. 040–23450735/23450624 ఫోన్‌ నంబర్‌తో ఈ కంట్రోల్‌ రూమ్‌ పనిచేయనుంది. ఐఏఎస్‌లకు సహాయకులుగా వ్యవసాయశాఖ డిప్యూటీ సెక్రటరీ సీహెచ్‌ శివలింగయ్య, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి వ్యవహరించనున్నారు. పోలీసు శాఖ తరఫున ఐజీ బాలంగన దేవి, అదనపు ఏస్పీ కె.శ్రీనివాసరావు, వైద్యారోగ్య శాఖ నుంచి ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ జేడీలు మోతీలాల్‌ నాయక్, డాక్టర్‌ జాన్‌బాబులు కంట్రోల్‌ రూమ్‌లో సేవలందించనున్నారు. ఇటు లాక్‌డౌన్‌ను సమీక్షించేందుకు సచివా లయంలో వార్‌రూమ్‌ను ఏర్పాటు చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు