డిగ్రీ–ఇంజనీరింగ్‌ ప్రవేశాల అనుసంధానం

5 Apr, 2018 02:37 IST|Sakshi

రెండింటినీ ఆన్‌లైన్‌ లింక్‌ చేస్తున్న ప్రవేశాల కమిటీలు

తద్వారా డిగ్రీ సీట్లు మిగిలిపోకుండా చర్యలు

డిగ్రీ ప్రవేశాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

ఆధార్‌ ఉంటే మొబైల్‌ ద్వారానే రిజిస్ట్రేషన్‌

లేదంటే హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌కు చర్యలు

వచ్చే నెల 8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ–ఇంజనీరింగ్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలని ప్రవేశాల కమిటీలు నిర్ణయించాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకూ దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే వారిలో ఎక్కువ శాతం మంది విద్యార్థులకు డిగ్రీతోపాటు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో సీట్లు లభిస్తున్నాయి. దీంతో ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో చేరుతున్న ఆయా విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్‌ విత్‌డ్రా చేసుకోవడం లేదు. దీంతో టాప్‌ డిగ్రీ కాలేజీల్లోని వేల సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీట్లు మిగిలిపోకుండా ఉండేందుకు ఎంసెట్‌–డిగ్రీ ప్రవేశాలను లింక్‌ చేయాలని ప్రవేశాల కమిటీలు నిర్ణయించాయి. 

సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల(దోస్త్‌) కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వెంకటాచలం ఈ అంశంపై సమావేశమై చర్చించారు. రెండింటినీ ఆన్‌లైన్‌లో లింక్‌ చేయడం ద్వారా ఒక విద్యార్థి ఇంజనీరింగ్‌లో చేరితే డిగ్రీలో అతనికి వచ్చిన సీటు ఖాళీ అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. తద్వారా సీట్లు మిగిలిపోకుండా చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. మరోవైపు డిగ్రీలో సీటు వచ్చిన విద్యార్థి తన సీటును కన్‌ఫర్మ్‌ చేసుకునేప్పుడు నిర్ణీత మొత్తాన్ని(ఓసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.500) చెల్లించే నిబంధనను విధించాలని నిర్ణయించారు. విద్యార్థి కాలేజీలో చేరాక లేదా ఆ సీటును వదులుకున్నాక ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా నిబంధనను విధించనున్నారు. 

ఆధార్‌ ఉంటే మొబైల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ 
మరోవైపు డిగ్రీ ప్రవేశాల్లో ఆధార్‌ను అనుసంధానం చేయడంతోపాటు మొబైల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకుసేందుకు డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల(దోస్త్‌) కమిటీ చర్యలు చేపట్టింది. వివిధ డిగ్రీ కోర్సుల్లో చేరే దాదాపు 2.25 లక్షల మంది విద్యార్థులు హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడం, ప్రైవేట్‌ ఇంటర్నెట్‌ సెంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం వల్ల పొరపాట్లు దొర్లడం వంటి సమస్యలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. 

విద్యార్థులే నేరుగా తమ మొబైల్‌ ఫోన్ల నుంచి ఆధార్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకుని వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికీ ఆధార్‌ లేని వారు పోస్టు ఆఫీసుల్లో ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని దోస్త్‌ కమిటీ సూచించింది. మే 8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేసి, మే 10వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించే నాటికి కూడా ఆధార్‌ లేని వారు హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. 

విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు 
డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలూ చేపట్టాలని నిర్ణయించాం. ప్రవేశాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ప్రతి డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్, సీనియర్‌ అధ్యాపకులతో కూడిన కమిటీని సంప్రదించవచ్చు. ఆ కమిటీ పరిధిలో సమస్య పరిష్కారం కాకపోతే ఇంటిగ్రేటెడ్‌ కాలేజీల ప్రిన్సిపాల్‌ నేతృత్వంలోని జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీని సంప్రదిస్తే సమస్యను పరిష్కరిస్తుంది. అక్కడా సమస్యకు పరిష్కారం లభించకపోతే యూనివర్సిటీలోని కోఆర్డినేషన్‌ సెంటర్‌లో సంప్రదించవచ్చు. 

అయినా సమస్య అలాగే ఉంటే చివరగా కళాశాల విద్యా కమిషనరేట్, దోస్త్‌ కార్యాలయాల్లో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆయా కమిటీలకు సంబంధించిన సమగ్ర వివరాలను ఇంటర్‌ ఉత్తీర్ణులయ్యే ప్రతి విద్యార్థికి(మెమో డౌన్‌లోడ్‌ చేసుకునేప్పుడే) ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ రూపంలో అందించేలా చర్యలు చేపడుతున్నాం. అలాగే ఈసారి ఎస్‌ఎంఎస్‌ సేవలను అందుబాటులోకి తెస్తాం. ఎప్పటికప్పుడు వివరాలను విద్యార్థికి పంపిస్తాం. 
                 – ప్రొఫెసర్‌ లింబాద్రి, దోస్త్‌ కన్వీనర్‌   

మరిన్ని వార్తలు