మన డిగ్రీకి మస్త్‌ డిమాండ్‌

30 May, 2018 02:15 IST|Sakshi

ఇక్కడి డిగ్రీ చదువు కోసం

26 రాష్ట్రాల నుంచి దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో డిగ్రీ చదివేందుకు ఇతర రాష్ట్ర విద్యార్థులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఏపీ నుంచి 932 మంది దరఖాస్తు చేసుకోగా, మరో 25 రాష్ట్రాలకు చెందిన 400 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, కేరళ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారుండగా, విదేశాల్లో చదువుకొని, రాష్ట్రంలో డిగ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 35 మంది ఉన్నారు.

ఇక డిగ్రీ మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా మొత్తంగా 1,43,657 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,36,788 మంది ఫీజు చెల్లించగా, 1,31,415 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ వచ్చే నెల 4న సీట్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి వెల్లడించారు. వారంతా 5 నుంచి 12 లోగా కాలేజీల్లో చేరాలని పేర్కొన్నారు.

ఇక సీట్లు రాని వారు వచ్చే నెల 5 నుంచి 14 వరకు ఆప్షన్లను మార్చుకొనేలా, కొత్త ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. వారికి 19న సీట్లను కేటాయించనుంది. వారంతా 20 నుంచి 27 లోగా కాలేజీల్లో చేరాలి. తరగతులను జూలై 2 నుంచి ప్రారంభించనుంది. ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల కోసం మూడో దశ కౌన్సెలింగ్‌ నిర్వహించేలా దోస్త్‌ చర్యలు చేపట్టింది. వారంతా జూన్‌ 20 నుంచి 27 వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూలు ప్రకటించింది.

వారితోపాటు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోని వారు కూడా రిజిస్టర్‌ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. వారంతా ఇచ్చే వెబ్‌ ఆప్షన్లను బట్టి జూన్‌ 30న సీట్లను కేటాయించనుంది. విద్యార్థులు జూలై 2 నుంచి 4వ తేదీ లోగా కాలేజీల్లో చేరాలి. ఆ తరువాత కాలేజీ పరిధిలోనే గ్రూపులను మార్చుకునేందుకు ఈసారి మరో అవకాశం కల్పిస్తోంది. గ్రూపు మార్పు చేసుకోవాలనుకునే వారు జూలై 5 నుంచి 7 వరకు ఆప్షన్లను ఇచ్చుకుంటే ఖాళీలను బట్టి దోస్త్‌ సీట్లను కేటాయిస్తుంది.

మరిన్ని వార్తలు