ఈ పాచిక వయసు రెండువేల ఏళ్లు

17 Mar, 2018 03:08 IST|Sakshi
ఎముకతో కళాత్మకంగా తీర్చిదిద్దిన ఈ పాచిక ఒకటో శతాబ్ది నాటిదిగా భావిస్తున్నారు. ఇన్ని శతాబ్దాలపాటు మట్టిపొరల్లో దాగిన ఈ అరుదైన వస్తువు రెండు రోజుల క్రితం పురావస్తుశాఖ తవ్వకాల్లో వెలుగు చూసింది.  

ఎముకతో తయారీ...

 శాతవాహన కాలం నాటిదిగా భావిస్తున్న పురావస్తు శాఖ 

పెద్దబొంకూరు తవ్వకాల్లో వెలుగులోకి  

సాక్షి, హైదరాబాద్‌: పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరులో రాష్ట్ర పురావస్తు శాఖ (హెరిటేజ్‌ తెలంగాణ) తాజాగా చేపట్టిన తవ్వకాల్లో ఈ వస్తువులు వెలుగు చూశాయి. ఐదు దశాబ్దాల కాలంలో ఇక్కడ మూడు నాలుగు పర్యాయాలు తవ్వకాలు జరిపారు. అప్పట్లో వేల సంఖ్యలో శాతవాహన, రోమన్‌సహా పలు దేశాల నాణేలు వెలుగు చూశాయి. దీంతో ఇది శాతవాహనకాలం నాటి ప్రధాన వర్తక కేంద్రంగా భావిస్తున్నారు. నాణేల ముద్రణ కేంద్రం కూడా అయి ఉంటుందన్న అనుమానాలూ ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో తవ్వకాలు ప్రారంభించారు.

నాలుగు రోజుల క్రితమే తవ్వకాలు మొదలు కాగా, కొన్ని మట్టి పాత్రలు, ఇతర అవశేషాలు, నాటి గోడల ఆనవాళ్లు కనిపించాయి. కానీ రెండు రోజుల క్రితం అలనాటి పాచిక, ఓ రాగి నాణెం వెలుగుచూశాయి. నాణెం చాలాకాలం మట్టిలో ఉండటంతో దానిపై ముద్రలు, అక్షరాలు చెదిరిపోయి స్పష్టంగా కనిపించటం లేదు. గత నెల పురావస్తు శాఖ సంచాలకురాలు విశాలాచ్చి ఈ తవ్వకాలు ప్రారంభించారు. ఆ శాఖ సహాయ సంచాలకులు రాములు నాయక్‌ నేతృత్వంలో జరుగుతున్న తవ్వకాలను శాఖ విశ్రాంత ఉప సంచాలకులు రంగాచార్యులు, సహాయ సంచాలకులు నాగరాజు, విశ్రాంత అధికారి భానుమూర్తి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో జరిపిన తవ్వకాల్లో, వేల ఏళ్లనాడే ఇక్కడ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్టు గుర్తించారు. నీటి వనరులకోసం ప్రత్యేక ఏర్పాటు, నీటి తరలింపు చానళ్లు కనిపించాయి. వాటికి వాడిన ఇటుకలతోపాటు, అత్యంత నునుపుగా పాత్రల తయారీని బట్టి ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. కానీ తవ్వకాలు చాలా పరిమితంగా నిర్వహించటంతో పెద్దగా చారిత్రక ఆధారాలు దొరకలేదు.

ఇది అతి చిన్న మట్టిపాత్ర. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ మనుగడలో ఉన్న గురిగి (చిన్న మట్టిపాత్ర) కంటే పరిమాణంలో చిన్నగా ఉన్న ఈ పాత్ర కూడా శాతవాహనుల కాలం నాటిదే. రెండు అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న ఈ పాత్ర కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.  

విలువైన ఆధారాలు దొరికే అవకాశం 
‘‘ఇక్కడ శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి విలువైన సమాచారం దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా గౌతమీపుత్ర శాతకర్ణి నాణేల కోసం వెదుకుతున్నాం. నాణేలతో కొత్త కోణాలు వెలుగు చూస్తాయి. ఇక నాటి వస్తువులు, నిర్మాణ పరిజ్ఞానం, ఆయుధ సంపత్తి, పాత్రలు, సాహిత్యానికి సంబంధించిన ఆనవాళ్లు దొరకవచ్చు. రెండుమూడు నెలల పాటు తవ్వకాలు జరుగుతాయి’’
– విశాలాచ్చి, సంచాలకురాలు 

మరిన్ని వార్తలు