కాంగ్రెస్‌ నేతలవి అసత్య ఆరోపణలు

5 Mar, 2019 01:50 IST|Sakshi

ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో చేరుదామనుకున్న తమపై కాంగ్రెస్‌ అగ్రనేతలు దుష్ప్రచారానికి పాల్పడటం తగదని ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు అన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. పార్టీ మారుదామనుకున్న తమపై పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో కలసి నడవాలని నిర్ణయించుకున్నామని ఇప్పటికే స్పష్టం చేశామని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని లేఖలో ప్రస్తావించామని పునరుద్ఘాటించారు.

ఎంతకు అమ్ముడు పోయారని మాపై సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసుల ఆత్మగౌరవం దెబ్బతినేలా కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలలో నాలుగు గ్రూప్‌లు ఉన్నాయి, వారు ఎక్కడికి వచ్చి ధర్నాలు చేస్తారో తామూ చూస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే రూ.50 లక్షలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సొంత ఎమ్మెల్యేలకు ఆఫర్‌ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆత్రం సక్కు మాట్లాడుతూ.. అగ్రవర్ణాల ఎమ్మెల్యేలు పార్టీలు మారితే.. విమర్శించరుగానీ, ఆదివాసీ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే.. ఆత్మగౌరవం దెబ్బతినేలా ఆరోపణలు చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. తమపై కాంగ్రెస్‌ నాయకులు చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు