గూడు దొరికేనా?

5 Feb, 2015 02:22 IST|Sakshi
గూడు దొరికేనా?

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరు లేనట్టేనా..?
సొంతింటి కోసం నిరుపేదలకు తప్పని నిరీక్షణ
మన ప్రణాళికలో 2లక్షల దరఖాస్తులు

 
నల్లగొండ టుటౌన్ : నిలువ నీడ లేక అద్దె ఇళ్లల్లో, గుడిసెల్లో నివసించే నిరుపేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్, కిచెన్, హాల్‌తో కూడిన ఇల్లు నిర్మించి ఇస్తాం.. ఇది సార్వత్రి ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ.. కానీ ఎన్నికలు ముగిసి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఇప్పటి వరకు డబుల్‌బెడ్ రూమ్ పథకంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల  నిర్మాణాలకే ఇటీవల బకాయిల కింద నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంది. జిల్లాలో సొంతిళ్లులేని వారు లక్షల్లోనే ఉన్నారు. వీరంతా గూడు కోసం నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది.

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకే నిధులు...

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాలో 2006 నుంచి 2014 ఏప్రిల్ వరకు వివిధ దశల్లో ప్రభుత్వం మొత్తం 4.20 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో గత ఏప్రిల్ నెలాఖరు వరకు 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తికాగా మరో 60 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో లక్షా 10 వేల ఇళ్లను లబ్ధిదారులు అసలు ప్రారంభించనేలేదు. గతంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు ఇటీవల టీఆర్‌ఎస్ ప్రభుత్వం బకాయిల కింద జిల్లాకు 20 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కేవలం బకాయిలు చెల్లించడంతో పాటు వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే డబ్బులు చెల్లించడానికి నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక ఇంటిని కూడా మంజూరు చేయలేదు.

ఈ ఏడాది ఇళ్ల మంజూరు లే నట్టేనా..?

తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీపై లక్షల మంది లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వీరి ఆశలు ఈఏడాది ఫలించేలా కనిపించడంలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల అయితే ముగిసిపోనుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్‌పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇక ఈ సంవత్సరం ఇళ్ల మంజూరు కలగానే మిగిలే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఈ ఏడాది అంతా ఇళ్ల నిర్మాణంపై ఆశలు పెట్టుకున్న వారికి అడియాశలుగానే మిగిలేఉన్నాయి. మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా ఇక వీటిపై నిర్ణయం తీసుకునేది ఎప్పుడు, నిధుల మంజూరు ఎలా, అనే దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తీరు చూస్తుంటే ఇక ఈ సంవత్సరం కొత్త పథకం వచ్చే అవకాశం ఉండకపోవచ్చని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

‘మన ప్రణాళిక  ద్వారా 2 లక్షల దరఖాస్తులు

గత ఏడాది వరకు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఆర్థిక భారంతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వారు లక్ష 10 మంది ఉన్నారు. అదే విధంగా కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తరువాత నిర్వహించిన మన వార్డు మన ప్రణాళిక, మన పట్టణం, మన వార్డు ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది కొత్త ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఎస్సీలకైతే రూ. లక్ష, ఎస్టీలకైతే రూ. 1.10 లక్షలు, ఇతరులకు 70 వేల రూపాయలు ఇచ్చేది. పెరిగిన ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కనీసం కట్టడానికి కూడా సరిపోవని చాలా మందికి ఇళ్లు మంజూరు అయినా నిర్మించుకోవడానికి ముందుకు రాలేదు. కానీ ప్రభుత్వం 3.50 లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్, కిచెన్, హాల్ నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో మన వార్డు మన ప్రణాళిక లో  2 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు  చేసుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు