భారత మాత గా కుష్భు | Sakshi
Sakshi News home page

భారత మాత గా కుష్భు

Published Thu, Feb 5 2015 2:05 PM

భారత మాత గా కుష్భు - Sakshi

సాక్షి, చెన్నై: భారత మాతగా నటి కుష్భును చిత్రీకరిస్తూ కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. మదురైలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ రచ్చకెక్కింది. బీజేపీ నాయకులు కాంగ్రెస్ వర్గాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినీ ప్రేక్షకాభిమానుల ఆరాధ్య దేవత కుష్భు. ఆమెకు గతంలో ఆలయాన్ని సైతం నిర్మించారంటే అభిమానం ఏ పాటిదో అర్థంచేసుకోవచ్చు. సినీ వినీలాకాశం నుంచి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డీఎంకేలో అడుగు పెట్టారు.

అయితే, అక్కడి రాజకీయాలు కుష్భు తట్టుకోలేకపోయారు. చివరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్భు ఆ పార్టీలో సెలబ్రెటీ అయ్యారు. ఆమె నేతృత్వంలో సభలు, సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ వర్గాలు ఉరకలు పరుగులు తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గణతంత్ర వేడుకల్లో భాగంగా మదురైలో కాంగ్రెస్ నాయకులు కుష్భు మీదున్న అభిమానంతో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
 
మదురై ఉత్తన్ కుడి బస్టాండ్ వద్ద గత నెల 26న ఓ ఫ్లెక్సీని కాంగ్రెస్ వర్గాలు ఏర్పాటు చేశాయి. అయితే, దీనిని ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. అతి పెద్ద ఫ్లెక్సీ కావడంతో అందులో ఉన్నదెవరో గుర్తించ లేని పరిస్థితి. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సింహంపై భారత మాత చేతిలో జెండాను పెట్టుకున్నట్టుగా ఈ ఫ్లెక్సీని రూపొందించారు. తొలుత ఈ ఫ్లెక్సీని పెద్దగా పట్టించుకోలేదు. బుధవారం ఆ పరిసర వాసులు తీక్షణంగా పరిశీలించడంతో అందులో కుష్బు ముఖం ఉన్నట్లు బయట పడింది.
 
సమాచారం అందుకున్న అక్కడి బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్గాలపై దుమ్మెత్తి పోశారు. వారం రోజులకు పైగా ఈ వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉన్నా, పోలీసులు పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత మాతగా ఆ ఫ్లెక్సీలో ఉన్న చిత్రం ఖుష్భుగా గుర్తించడంతో వివాదం రాజుకుంది. ఆ ఫ్లెక్సీని తొలగించాల్సిందేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆగమేఘాలపై ఆ ఫ్లెక్సీని తొలగించి, అందులోని పేర్ల ఆధారంగా దానిని ఏర్పాటు చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయడం కొసమెరుపు.

Advertisement
Advertisement