సరళీకరణ వల్లే ఉద్యమాలకు మధ్యతరగతి దూరం

23 Nov, 2014 02:59 IST|Sakshi
సరళీకరణ వల్లే ఉద్యమాలకు మధ్యతరగతి దూరం
  • తమ్మారెడ్డి సత్యనారాయణ స్మారకోపన్యాసంలో కోదండరాం
  • సాక్షి, హైదరాబాద్: దేశంలోని మధ్య తరగతి ప్రజలు ఉద్యమాలకు దూరం కావడానికి 1995 సరళీకరణ విధానాలే కారణమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉందని, దీనిపై యూనివర్సిటీలు సహా సర్వత్రా చర్చ జరగాలని పేర్కొన్నారు. సీపీఐ నాయకుడు తమ్మారెడ్డి సత్యనారాయణ 23వ వర్థంతి సందర్భంగా శనివారమిక్కడ ‘ప్రజాస్వామ్యంలో ప్రజాసంఘాల పాత్ర’ అనే అంశంపై సమావేశం జరిగింది.

    ఈ సందర్భంగా కోదండరాం స్మారకోపన్యాసం చేస్తూ.. సరళీకరణ కారణంగా ఆర్థిక రంగంలో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘సరళీకరణతో అందరికీ అవకాశాలు అంటున్నారు కానీ వనరులపై పెత్తనం కొద్దిమంది చేతుల్లోకే వెళ్లిపోయింది. విద్యుత్, ఇతరత్రా వనరులు సంపన్నుల చేతుల్లోకి, ప్రైవేటు రంగంలోకి వెళ్లాయి. అంతేకాకుండా ఇష్టారాజ్యంగా భూముల పందేరం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలకు మధ్య రాజకీయ వ్యక్తీకరణ సరిగా జరిగినప్పుడే ఫలితం ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

    ఎమర్జెన్సీ నుంచి 1995 వరకు దేశంలో పౌరహక్కుల ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, పర్యావరణ, రైతు ఉద్యమాలతోపాటు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. అయితే అనేక ఉద్యమాలను కమ్యూనిస్టు పార్టీలు పెద్దగా పట్టించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో కార్పొరేట్ శక్తులు ఎన్నికలను ప్రభావితం చేస్తే... తెలంగాణ మాత్రమే ప్రజల ఎజెండాగా ముందుకు వచ్చి రాష్ట్రాన్ని సాధించుకుందని చెప్పారు.

    ప్రస్తుతం ఎన్నికల్లో డబ్బు, మతం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని కోదండరాం ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా  ధర్మభిక్షంపై రాసిన పుస్తకాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు