నకిలీ విజిలెన్స్ అధికారి గుట్టు రట్టు

19 Jun, 2014 02:42 IST|Sakshi
నకిలీ విజిలెన్స్ అధికారి గుట్టు రట్టు

- నిందితుడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు
- పోలీసుల అదుపులో డ్రైవర్, కారు
- కేసు నీరుగార్చేందుకు యత్నం

కరీంనగర్ క్రైం : అతడో మాజీ ఎంపీటీసీ సభ్యుడు. ప్రజాప్రతినిధిగా ఉంటే ఏముందనుకున్నాడో ఏమో ఏకంగా స్పెషల్ విజిలెన్స్ అధికారిగా అవతారమెత్తాడు. తాను ప్రత్యేక అధికారినని చెప్పుకుంటూ వ్యాపారులను బెదిరిస్తూ అందిన కాడికి దోచుకున్నాడు. లక్షల రూపాయలు వసూలు చేసిన  అ తడి బండారాన్ని చివరకు పోలీసులు బట్టబయలు చేశారు. కమాన్‌పూర్ మండలంలోని పిల్లిపల్లి గ్రామానికి చెందిన పిల్లి చంద్రశేఖర్ కమాన్‌పూర్-2 మాజీ ఎంపీటీసీ సభ్యుడు. ముదిరాజ్ సంఘ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న అతడు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నాడు.

కొన్ని నెలలుగా విజిలెన్స్ అధికారుల దాడులు పెరిగిపోవడంతో అతడు కూడా విజిలెన్స్ అధికారిగా అవతారమెత్తాడు. ఓ కారు(ఏపీ 36 ఎస్ 2727 స్విఫ్ట్ డిజైర్)లో తిరుగుతూ తన సహాయకుడు పిట్టల సమ్మయ్య సాయంతో గోదాములు, వ్యాపార సముదాయాలకు తనిఖీకి వెళ్లేవాడు. తాను హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక విజిలెన్స్ అధికారినని చెప్పి రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించేవా డు. రికార్డులు సరిగా లేవని, పెద్దమొత్తంలో జరిమానా వేయాల్సి ఉంటుందని భయపెట్టేవాడు.

తాను ముందుగా వచ్చానని పెద్దసార్లు వస్తే ఇంకా ఎక్కువ జరిమానా విధిస్తారని భయపెట్టేవాడు. అతడి సహాయకుడు సమ్మయ్య కూడా సార్ బాగా స్ట్రిక్ట్ కేసులు నమోదు చేస్తాడంటూ వ్యాపారులను భయపెట్టేవాడు. చివరకు బేరం కుదుర్చుకుని అందినకాడికి పట్టుకుని వెళ్తుండేవాడు. ఇలా ఇప్పటివరకు పెద్దపల్లి, సుల్తానాబాద్, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల ప్రాంతాలో రూ. 20 లక్షలకు పైగా వసూలు చేశారని సమాచారం.
 
చిక్కిందిలా..
నాలుగు రోజుల క్రితం నగరంలోని గంజ్ ప్రాంతంలో ఉన్న ఓ బియ్యం వ్యాపారికి చెందిన గోదాం వద్దకు వెళ్లిన చంద్రశేఖర్, అతడి సహాయకుడు సమ్మయ్య  రికార్డులు పరిశీలించా రు. వ్యాపారి రికార్డులు సరిగానే ఉన్నా పలు కారణాలు చెబుతూ నీపై కేసులు నమోదవుతాయని భయపెట్టారు. వీరిపై అనుమానం వచ్చిన వ్యాపారి వారి మాటలు రికార్డు చేశాడు. చంద్రశేఖర్ రూ.5 లక్షలు డిమాండ్ చేయగా, రూ. లక్ష ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. రూ. 50 వేలు ఇచ్చి, సాయంకాలం మిగతా ది ఇస్తానని చెప్పా డు. ఆ తర్వాత వన్‌టౌన్ సీఐ కరుణాకర్‌కు సమాచారం అందిం చాడు. పోలీసులు చంద్రశేఖర్‌ను నకిలీ అధికారిగా గుర్తించారు. సాయంకాలం సమ్మయ్య డబ్బుల కోసం రాగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. పలు ప్రాంతాల్లో ఇలాగే వసూలు చేశామని చెప్పడంతో పిల్లి చంద్రశేఖర్, సమ్మయ్యపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చంద్రశేఖర్ పరారీలో ఉన్నాడు.

పోలీసులపై ఒత్తిడి...
నకిలీ విజిలెన్స్ అధికారిగా పలువురిని మోసం చేసిన పిల్లి చంద్రశేఖర్ అధికార పార్టీలో ఉండడంతో కేసు నీరుగార్చేం దుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు కమాన్‌పూర్ మండలానికి చెందిన ఎంపీటీసీల క్యాంపునకు వెళ్లాడని తెలిసింది. ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు