ఈ–వేస్ట్‌ విస్ఫోటనం!

16 May, 2019 09:19 IST|Sakshi

పనిచేయని సేకరణ కేంద్రాలు

శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్‌ చేయకుంటే పర్యావరణానికి హాని

దేశంలో ఈ–వ్యర్థాల ఉత్పత్తిలో నగరానిది ఐదో స్థానం

సాక్షి, సిటీబ్యూరో: పెరుగుతోన్న ఆధునిక ఐటీ–హార్డ్‌వేర్‌ ఆధారిత పరిశ్రమలు, కంప్యూటర్, గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు గ్రేటర్‌ నగరాన్ని ఈ–వేస్ట్‌కు అడ్డాగా మారుస్తున్నాయి. మహానగరం పరిధిలో కంప్యూటర్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు విరివిగా వినియోగిస్తున్న ఒక్కో ఇంటి నుంచి ఏటా సగటున 5 కిలోల ఈ–వ్యర్థాలు ఉత్పన్నమౌతున్నట్లు ఈపీటీఆర్‌ఐ సర్వే అంచనా వేసింది. ఈ వ్యర్థాల ఉత్పత్తిలో దేశంలో ముంబై తొలిస్థానంలో నిలవగా ఆ తర్వాత ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలు నిలిచాయి. మన గ్రేటర్‌ నగరం ఈ మెట్రో నగరాల తర్వాత ఐదోస్థానంలో నిలవడం గమనార్హం. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏటా సుమారు 12.5 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పోగు పడుతుండగా..మన మహానగరంలో ఏటా సుమారు 40 వేల టన్నుల ఈ–వేస్ట్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కాగా 2009లో నగరంలో కేవలం 3262 మెట్రిక్‌ టన్నుల ఈ–వ్యర్థాలే ఉత్పన్నమయ్యేవి. కానీ ప్రస్తుతం నగరంలో సుమారు 40 వేల మెట్రిక్‌ టన్నులు పోగవుతున్నాయి. ఇందులో సుమారు 75 శాతం వరకు గృహాల నుంచే వెలువడుతున్నట్లు తేలింది. మరో ఐదేళ్లలో నగరంలో ఈ–వ్యర్థాలు లక్ష టన్నుల మార్కును చేరుకుంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించే రీతిలో సాధారణ చెత్తతో పాటే పడవేస్తుండడంతో ఇవి పర్యావరణంలో కలిసి అనర్థాలు తలెత్తుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

గ్రేటర్‌లో ఏటా 40 వేల టన్నుల ఈ–వ్యర్థాలు
గ్రేటర్‌లో ఈ–వేస్ట్‌  వ్యర్థాలపై  గచ్చిబౌలిలోని ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఈపీటీఆర్‌ఐ)గతంలో నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే వాస్తవాలు బయటపడ్డాయి.
ఏటా టెలివిజన్స్, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లకు సంబంధించి ఏడాదికి 12 వేల టన్నుల వ్యర్ధాలు విడుదలవున్నట్లుగా తేలింది. ఇక టెలిఫోన్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీలు, కూలర్లు...ఇలాంటి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్‌ వ్యర్థాలను కలుపుకుంటే ఏడాదికి మొత్తంగా సుమారు 28 వేల టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా వేసింది. రాబోయే ఐదేళ్లలో ఈ–వ్యర్థాలు లక్ష టన్నులకు చేరుకునే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి.

పనిచేయని సేకరణ కేంద్రాలు..?
ఈ–వ్యర్థాల శుద్ధికి ప్రపంచ బ్యాంకు సౌజన్యంతో మన దేశవ్యాప్తంగా క్లీన్‌ ఈ–ఇన్షియేటివ్‌ అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద గ్రేటర్‌ నగరంలో గైడ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్, అట్టెరో ఎలక్ట్రానిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కూకట్‌పల్లి, ఖైరతాబాద్, హఫీజ్‌పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో పేరుకే ఈ–వేస్ట్‌ సేకరణ కేంద్రాలను స్థాపించారు. అయితే ఈ కేంద్రాలకు ఎలా వ్యర్థాలను తరలించాలన్న అంశంపై వినియోగదారుల్లో అవగాహన కల్పించే విషయంలో పీసీబీ విఫలమౌతోంది. ఈ కేంద్రాల పనితీరు సైతం ప్రశ్నార్థకమౌతోంది.

ఈ–వేస్ట్‌ను పునఃశుద్ధి(రీసైక్లింగ్‌) చేయని కారణంగా తలెత్తే సమస్యలివీ..
క్యాథోడ్‌రేట్యూబ్‌లు:టీవీల్లో వినియోగించే ఈ ట్యూబుల్లో లెడ్, బేరియం ఇతర భారలోహాలు, నీటిని విషయంగా మార్చే సల్ఫర్‌ భూగర్భజలాల్లోకి చేరుతున్నాయి.  
ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు: వీటిని వృథాగా పడవేయడంతో బ్రోమిన్, బెరీలియం, క్యాడ్మియం, మెర్క్యూరీ వంటి పదార్థాలు భూగర్భజలాల్లోకి చేరుతున్నాయి. అంతేకాదు వీటి తయారీలో విరివిగా వినియోగించే బంగారం, రాగి, వెండి, ప్లాటినం, పెల్లాడియం, జింక్, నికెల్, ఇనుము వంటి లోహాలను తిరిగి సంగ్రహించకుండా(రీసైకిల్‌ లేకుండా)వదిలివేయడంతో ఆయా సహజ వనరులపై వత్తిడి పెరుగుతోంది.
ఈ–చిప్స్, బంగారు పూత విడిభాగాలు: హైడ్రోకార్భన్‌లు, భారలోహాలు జలాశయాల్లోకి చేరి అందులోని చేపలు, ఇతర వక్షఫ్లవకాలను నాశనం చేస్తున్నాయి. భూగర్భజలాలు సైతం విషతుల్యమౌతున్నాయి.
ప్రింటర్లు, కీబోర్డులు: హైడ్రోకార్భన్లు, భారలోహాలు భూమి, నీరు, భూగర్భజలాలను కలుషితం చేస్తున్నాయి.
కంప్యూటర్‌ వైర్లు: వీటిని మండించడం వల్ల పాలీ ఆరోమాటిక్‌ హైడ్రోకార్భన్లు పర్యావరణంలోకి వెలువడి భూమి,నీరు,గాలిని విషతుల్యంగా మారుస్తున్నాయి.
కంప్యూటర్‌ విడిభాగాలు,రబ్బరు,ప్లాస్టిక్‌ వస్తువులు: పాలీ ఆరోమాటిక్‌ హైడ్రో కార్భన్లు వెలువడి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.
టోనర్‌ కాట్రిడ్జులు: వీటిని దహనం చేయడం వల్ల పీల్చే గాలి కలుషితమౌతోంది.

ఎలక్ట్రానిక్, కంప్యూటర్‌ విడిభాగాలనుంచి వెలువడే ఉండే ముఖ్య మూలకాలు–వాటి వల్ల తలెత్తే సమస్యలివే..
క్యాథోడ్‌ రే ట్యూబ్‌లు: లెడ్‌: నాడీ, రక్తప్రసరణ వ్యవస్థలు దెబ్బతింటాయి.
ఎల్‌సీడీలు: మెర్క్యూరీ: మెదడు, రక్తనాళాలు దెబ్బతింటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
కంప్యూటర్లు: కాపర్, సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్,లెడ్, ఆర్సినిక్,  
క్యాడ్మియంలు: ఆమ్ల వర్షాలకు కారణమౌతాయి. పీల్చే గాలి విషతుల్యమౌతుంది.
సెమీకండక్టర్లు: రసాయనాలు, మూలకాలు: శ్వాసక్రియ, రక్తప్రసరణ వ్యవస్థ, కాలేయం, వినాళ గ్రంథులు దెబ్బతింటాయి.

మరిన్ని వార్తలు