విద్య వంటింటికే పరిమితం కాకూడదు

16 Dec, 2014 02:57 IST|Sakshi
విద్య వంటింటికే పరిమితం కాకూడదు

బాన్సువాడ టౌన్ : విద్య వంటింటికే పరిమితం కాకూడదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బ్రహ్మిపత్రార్చన మహోత్సవానికి మంత్రి హాజరై భక్తులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల్లో ఉన్న మేధాశక్తిని, విజ్ఞానాన్ని పెంపొందించేది ఉపాధ్యాయులైతే సరస్వతి దేవి అనుగ్రహం కూడా అవసరమేనని అన్నారు. ప్రపంచంలో అతి విలువైనది విజ్ఞానం అని, డబ్బు కంటే విజ్ఞనానికే విలువ ఉంటుందన్నారు.  

రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు నిర్మించేందుకు విదేశీయులు రూ. 2 లక్షల 35 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని అందుకోసం శంషాబాద్, ఉప్పల్, గచ్చిబౌల్ ప్రాంతాల్లో స్థలాలను కూడా సేకరించారని, పరిశ్రమల ద్వారా 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి వివరించారు. అందుకే విద్యను పెంపొందించుకోవాలని సూచించారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో శ్యాంప్రసాద్ లాల్, నాయకులు సురేందర్‌రెడ్డి, శంభూరెడ్డి, కృష్ణరెడ్డి, అంజిరెడ్డి. గంగాధర్, గోపాల్‌రెడ్డి, ఎజాస్, సురేష్, జంగం విజయ, వాణి, లింగం తదితరులు ఉన్నారు.

మంత్రికి త్రుటిలో తప్పిన ప్రమాదం
బాన్సువాడ టౌన్ : బ్రహ్మిపత్రా మహోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి హాజరైన మంత్రిని నిర్వాహకులు స్టేజిపైకి ఆహ్వానించారు. స్టేజిపైకి మంత్రితోపాటు  వెంట వచ్చిన అనుచరులు చోటమోట నాయకులు ఎక్కడంతో స్టేజి ఒక్కసారిగా కుప్పకూలింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూర్చున్న కుర్చీ అలాగే కిందికి జారిపోయింది. దీంతో మంత్రికి ప్రమాదం తప్పింది. భక్తులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. మంత్రి క్షేమంగా ఉన్నారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మంత్రి భక్తులనుద్దేశించి మాట్లాడి తొందరగానే ప్రసంగం ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరివెళ్లారు.

మరిన్ని వార్తలు