అందరికీ ఆమె రోల్‌మోడల్‌: నరసింహన్‌

28 Aug, 2019 18:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు 2020 ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడం ఖాయమని తెలంగాణ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. మన సత్తా ఏమిటో ప్రపంచానికి సింధు చాటిందని ప్రశంసించారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌గా నిలిచిన సింధుతో పాటు, పారా బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన మానసి జోషిలను రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్‌ మాట్లాడుతూ.. మానసి జోషి అద్భుత విజయం సాధించి అందరికీ రోల్‌ మోడల్‌గా నిలిచారని పొడిగారు. సింధు, మానసి సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఒలింపిక్స్‌ స్వర్ణ పతకంతో వచ్చే ఏడాది రాజ్‌భవన్‌కు రావాలని ఆకాంక్షించారు. కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, సింధు తల్లిదండ్రులను ఆయన అభినందించారు.

ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడతానని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకునేందుకు కృషి చేస్తానని సింధు పేర్కొంది. తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, పుల్లెల గోపీచంద్‌, సింధు తల్లిదండ్రులు, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (చదవండి: ఆత్మీయ స్వాగతాలు... అభినందనలు..!)

మరిన్ని వార్తలు