ఇప్పటికింతే..! | Sakshi
Sakshi News home page

ఇప్పటికింతే..!

Published Tue, Jun 3 2014 2:56 AM

ఇప్పటికింతే..! - Sakshi

తెలంగాణ రాష్ట్రావతరణ వేళ జన బాహుళ్యానికి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ పేరిట మిగిలిన ప్రజానీకానికి కూడా శుభాకాంక్షలు. కానీ రెండు చోట్ల ప్రజలలో ఉన్న వేదన- దాశరథి, శ్రీశ్రీల ఆవేదన వంటిదే, ఇప్పట్లో తొలగిపోయేది కాదు. రెండు ప్రాంతాల మధ్య పరిష్కారం కాగలిగిన సమస్యల కంటె, పరిష్కారం కానివే ఎక్కువ ఉంటాయి.
 
 దేశ విభజనతో ప్రారంభమైన కాంగ్రెస్ నాయకత్వ స్వార్థపూరిత రాజకీయం తొలి భాషా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడం వరకు వచ్చింది.  ఈ విభజనతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఇప్పుడు ఇదొక భౌగోళిక వాస్తవం. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న సోదర తెలంగాణ ప్రజాబాహుళ్యానికి శుభాశీస్సులు. మనఃపూర్వక అభినందనలు.
 
 కుంటికాలితో నడిచే కోర్కె ఏల?
 వేల సంవత్సరాలుగా ఏక భాషా సంస్కృతులతో దీపించిన మన తెలుగు జాతి రెండు పరాయి పాలనలలో (బ్రిటిష్, నిజాం) చెట్టుకొకరు, పుట్టకొకరుగా మనుగడ సాగించింది. చివరికి ఆంధ్రోద్యమాల ద్వారా, రైతాంగ సాయుధ పోరాట పూర్వరంగంలో విముక్తమై మహోన్నత ఘడియలో ‘ఆంధ్రప్రదేశ్’ను ఏర్పరుచుకుంది. ఆ స్వప్నం మన కళ్ల ముందే కరిగిపోయింది. తప్పిదాలు సాధారణంగా ప్రజానీకంలో గాక, రాజకీయ నాయకత్వంలోనే వికృత రూపంలో గూడు కట్టుకుని ఉంటాయి. ఫలితంగా ఒకనాడు అటు తెలుగువారి ‘కోటి రతనాల వీణ’ తెలంగాణ, ఇటు రెండు కోట్ల తెలుగువారి తెలుగు మాగాణం సీమాంధ్ర కలగలసి వెరసి మూడు కోట్ల ఏక భాషా సంస్కృతికి చెందిన ప్రజలంతా అవిచ్ఛన్నమైన బంధంతో కలిసిపోయారని అనుకున్నాం. అయితే అనంతరం తలెత్తిన విభజనోద్యమం అటు, ఇటు కూడా రచయితలనూ, కవులనూ, చెడిపోని రాజకీయుల మనసులను కలచివేసింది. తెలంగాణ ప్రాంతంలో మహాకవి దాశరథి వంటివారు, సీమాంధ్ర ప్రాంతంలో శ్రీశ్రీ వంటివారు ఎంతో మనస్తాపానికి గురయ్యారు. విడవడి శతాబ్దాల పాటు అగచాట్లు పడ్డాం. ఉమ్మడి త్యాగాల ఫలితంగా అన్నదమ్ముల్లా, అక్కచెల్లెళ్ల వలె కలిసిపోయిన తెలుగువారి మధ్య విభేదాలు తేవడానికి  కొందరు రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న ప్రయత్నాలు చూసి దాశరథి మనసు వికలమైంది.
 
 అందుకే, ‘నీ కంటిని పొడుచుకుంటావా/ నీ యింటిని నీవు కాల్చుకుంటావా/ కుంటికాలితో నడిచే కోర్కె ఉన్నదా?/  జంట బాసి బతుకుటలో శాంతి ఉన్నదా?’ అంటూ ఆర్తనాదం చేశాడాయన. ‘చీల్చబడిన పరగణాలు/ చేర్చి ఒకటి చేయువరకు/ విశాలాంధ్ర వచ్చువరకు/ విరామమే లేదు మనకు/ సాటిలేని తెలుగుబలం మేటిదని చాటగలం’ అని భావించిన శ్రీశ్రీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత కర్తవ్య బోధ చేస్తూ ముందస్తు హెచ్చరిక ఒకటి చేశాడు. ‘ఏదో కొందరి సదుపాయం  కోసం ఈ రాష్ట్రం ఏర్పడలేదు. ఎవరో కొందరి ఉద్యోగులకని ఏర్పడలేదు... అది యావదాంధ్రుల అకుంఠిత దీక్ష, అజేయమైన సంక ల్పం ఫలితంగా... ఈ రోజు ఊరేగింపులు జరుగుతాయి. ఉత్సాహం ఉప్పొంగుతుంది. నిజమే, కానీ ఆ సంబరాల తర్వాత సామాన్య మానవుడి భుజస్కంధాల మీద సమస్త భారం పడుతుంది. అతనిదీ రాష్ర్టం. పెత్తనం వెలగబెట్టడానికి ముందుకొచ్చే పెద్దలిది గ్రహించాలి. సంతోషం సంరంభం నేడేనేడే.... సౌమార్గం సౌభాగ్యం రేపేరేపే’ అన్నాడు శ్రీశ్రీ. ఆంధ్ర రాష్ట్రావతరణకూ, ఆంధ్రప్రదేశ్ అవతరణకూ కలిపి సందర్భోచితంగా చేసిన హెచ్చరిక అది.
 
 ఆ చరిత్ర చెరిగిపోనిదే
 స్వార్థజీవులైన నాయకుల వల్ల (విభజనకు తోడ్పడిన బీజేపీ, టీడీపీలూ ఇందుకు మినహాయింపు కాదు) తెలుగువాళ్లు చీలినప్పటికీ జాతి పురా చరిత్ర చెరిగిపోదు. గుండె బరువెక్కినా చేయగలిగింది ఏమీ లేదు. పాతను నెమరువేసుకున్నా ఒరిగేదేమీ లేదు. గుంజాటనకు ఇది సమయమూ కాదు. ఆవేశకావేషాలకు అసలే తరుణం కాదు. అందుకే తెలంగాణ రాష్ట్రావతరణ వేళ జన బాహుళ్యానికి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ పేరిట మిగిలిన ప్రజానీకానికి కూడా శుభాకాంక్షలు. కానీ రెండు చోట్ల ప్రజలలో ఉన్న వేదన- దాశరథి, శ్రీశ్రీల ఆవేదన వంటిదే, ఇప్పట్లో తొలగిపోయేది కాదు. రెండు ప్రాంతాల మధ్య పరిష్కారం కాగలిగిన సమస్యల కంటె, పరిష్కారం కానివే ఎక్కువ ఉంటాయి. తెలుగువారందరి కష్టార్జితంతో వృద్ధిలోకి వచ్చిన రాజధాని హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులో ఉంచలేదు. కొత్త రాజధానిని నిర్మించుకోమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ‘భట్టిప్రోలు పంచాయతీ’ చెప్పేసింది. ఏ కేటాయింపులూ చేయకుండా గాలికి వదిలేసింది. నదీజలాల బోర్డుల నిర్మాణం బాగోతం ఎంత చక్కగా ఉన్నదో ముళ్ల పెరియార్ ప్రాజెక్టు కథ చెప్పక చెబుతోంది. అంతర్రాష్ట్ర వివాదాలను ఏమీ తేల్చకుండానే జరిగిన విభజన ‘తాంబూలాలు ఇచ్చేశాను, తన్నుకు చావండి’ చందంగా జరిగిపోయింది. ఓటు రాజకీయం ముగిసి ‘సీటు’ రాజకీయాలకు తెర లేచింది. అప్పుల పంపిణీలతో, లోటు బడ్జెట్లతో  పాలన సజావుగా సాగడానికి ఏమీ ఆస్కారం లేని పరిస్థితి. ఈ విషమ పరిస్థితులలో రెండుచోట్ల ‘సంబురాలు’ జరుగుతున్నాయి.
 
 ఆంధ్ర పదానికి కొత్త అర్థం ఎలా?
 తెలుగువాడు ఎంత చిత్రమైన వాడు! ఎక్కడ బయలుదేరాడు? ఏ దశకు చేరుకున్నాడు? వందల ఏళ్ల వీడి మహా ప్రయాణానికి ఆనందిద్దామా? ఈ సుదీర్ఘ యాత్ర సాగిన దారులలో కనిపించే చీలికలను చూసి ఆవేదన పడదామా? ‘ఆంధ్ర’ శబ్దం అంటేనే కొన్నాళ్లు ఏవగింపు. తెలుగుజాతి వైతాళికులూ, ఆంధ్రోద్యమ నేతలూ సురవరం వారు, మాడపాటి వారు ‘ఆంధ్రులు అంటే తెలుగు మాట్లాడేవారు. అట్టి ఆంధ్ర పదమునకు కొత్త అర్థమునిచ్చుటకు మనకు ఏ మాత్రమూ అధికారము లేదు’ అని చెప్పారు. అయినా కొందరు తెలుగువారిని ఉచ్చరించలేని మాటలతో దూషించిన వారూ ఉన్నారు.
 
  శకులూ, యవనుల దాడులను శాతవాహనులు అరికట్టారు. మధ్య యుగంలో తురుష్కులూ, మొగలుల దాడులను ఎదుర్కొనడంలో కాకతీయులు ముందున్నారు. కృష్ణానది దక్షిణ ప్రాంతం హైందవాన్నీ, సాంస్కృతిక ఔన్నత్యాన్నీ కోల్పోకుండా విజయనగర పాలకులూ, వారి దేశభక్తీ కాపాడాయి. చరిత్రకారులు నిర్ధారించిన ఈ వాస్తవాలు ఏవీ మన ఐక్యతకు వారధులు నిర్మించలేకపోయాయి. కోస్తా లేకపోతే, విదేశ వర్తక వాణిజ్యాలకు సముద్రం కూడా లేదు. అందుకే సీమాంధ్ర ప్రాంతాలను ఆక్రమించుకున్నా, పాలన తనకు సాధ్యం కాదని తెలుసుకున్న నిజాం నవాబు ఉత్తర మధ్య కోస్తా ప్రాంతాలనూ, రాయలసీమ నాలుగు జిల్లాలనూ ఫ్రెంచ్, బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులకు తెగనమ్మి సొమ్ము చేసుకున్నాడు. ఈ సొమ్ముతోనే హైదరాబాద్‌ను తీర్చిదిద్దడం చారిత్రక వాస్తవం.
 
 ఎప్పటికీ జీర్ణించుకోలేని వాస్తవమే!
తెలుగు జాతి పురా వైభవానికీ, సమైక్యతకూ చరిత్ర నిండా ఎన్నో సాక్షి సంతకాలు కనిపిస్తాయి. ఆంధ్ర రాజ్య స్థాపనాచార్యునిగా వెలిసిన వాడు ఆంధ్ర విష్ణువు. రణకళానిధి సుశర్మను ఢీకొని మగధను శాసించినవాడు శ్రీముఖుడు. శాతవాహన శకాన్ని ఆవిష్కరించి ఔత్తరాహులను గడగడలాడించిన హాలుడు మన తెలుగువాడు. దేశమంతటా విజయస్తూపాలను నాటించినవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. మాతృస్వామిక వ్యవస్థకు గుర్తుగా పేరులో తల్లి పేరునూ చేర్చుకునే సంప్రదాయం (గౌతమి) మొదటిసారి పాటించిన వారు తెలుగువారే. తెలుగు శిల్పుల ఉలులు బౌద్ధయుగ చరిత్రను మలిచిన రోజులను మరచిపోగలమా? ఇంత చారిత్రక నేపథ్యం కలిగినది తెలుగుజాతి. పైకి వ్యక్తం కాకపోవచ్చు కానీ,  ఇప్పుడు తమ జాతి కృత్రిమంగా చీలిపోవడం తెలుగువారికి జీర్ణించుకోలేని వాస్తవమే. కానీ దాశరథి చెప్పినట్టు ‘శ్రామిక జాతే విప్లవ గళం విప్పి మేల్కొన్నప్పుడు’ సరిహద్దులు ఎవరికి గుర్తుంటాయి?
- (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)
ఏబీకే ప్రసాద్

 

Advertisement
Advertisement