‘అదనపు’ అవినీతి..

10 Jan, 2015 04:57 IST|Sakshi
‘అదనపు’ అవినీతి..

* ఆర్వీఎంలో విద్యుద్దీకరణ పేరుతో అక్రమాలు
* రూ.అరకోటికి పైగా నిధులు పక్కదారి
* పనులు చేయకుండానే బిల్లులు డ్రా..
* సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వివాదాలకు నిలయంగా మారిన ఆర్వీఎం (రాజీవ్ విద్యామిషన్)లో మరో అక్రమం వెలుగు చూసింది. అదనపు గదుల విద్యుద్దీకరణ పనుల పేరుతో భారీగా నిధులు పక్కదారి పట్టాయి. పలు పాఠశాలల భవనాలకు నామమాత్రంగా పనులు చేసి రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేశారు. కొన్ని చోట్ల అసలు పనులు చేయకుండానే డబ్బులు దిగమింగారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ అక్రమాలపై కలెక్టర్ ఎం.జగన్మోహన్ కొరడా ఝలిపిస్తున్నారు. ఈ పనుల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సుమారు రూ. అరకోటికి పైగా పక్కదారి పట్టిన ఈ వ్యవహారం నిగ్గు తేల్చాలని విద్యుత్ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
 
పనులు చేయకుండానే బిల్లులు..
నిరుపేద విద్యార్థులు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రాజీవ్ విద్యా మిషన్‌కు ఏటా పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో నిర్మించిన సుమారు 420 అదనపు గదులకు విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది. ఒక్కో గదికి వైరింగ్, స్విచ్‌బోర్డులు, సర్వీసు వైర్లు, మెయిన్‌లు, ఇతర ఎలక్ట్రిసిటీ సామాన్లు, ట్యూబులు, ఫ్యాన్లు అమర్చాలని నిర్ణయించారు. ఇది అక్రమార్కులకు కలిసొచ్చింది. ఇష్టారాజ్యంగా పనులు చేసి అందినకాడికి దండుకున్నారు. ఒక్కో గదికి సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు బిల్లులు డ్రా చేశారు.

ఇలా సుమారు 420 గదులకు పైగా జరిగిన విద్యుద్దీకరణ పనులకు సుమారు రూ.1.26 కోట్ల మేరకు నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ పనుల్లో సుమారు రూ.అరకోటికి పైగా పక్కదారి పట్టినట్లు ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. చాలా చోట్ల అసలు పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అలాగే అనేక చోట్ల నామమాత్రంగా పనులు చేశారు. బిల్లులు మాత్రం వేలల్లో కాజేశారు. మరికొన్ని చోట్ల నాసిరకం వైర్లు, ఇతర సామగ్రీని ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డారు.
 
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం..
నాసిరకంగా జరిగిన ఈ వైరింగ్ పనులు చాలా చోట్ల అస్తవ్యస్థంగా తయారయ్యా యి. అనేక చోట్ల స్విచ్‌బోర్డులు పగిలిపోయి వైర్లు తేలాయి. వీటిని ముట్టుకుంటే చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదాలు అనేక పాఠశాలల్లో పొంచి ఉన్నాయి. అలాగే నాసిరకం ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు అసలు పనిచేయడం లేదు.

ఎస్‌ఎంసీల ఇష్టారాజ్యం : విద్యుద్దీకరణ పనుల కోసం వచ్చిన నిధులను అధికారులు ఆయా పాఠశాలల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ)లకు అప్పగించారు. అ నేక చోట్ల ఈ క మిటీల్లో సభ్యులుగా ఉన్న చోటా మోటా నేతలు, కొందరు హెఎంలు కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తూతూ మం త్రంగా పనులు చేసి, కొన్నిచోట్ల అసలు చేయకుండానే నిధులు పంచుకున్నారు.
 
ఆర్వీఎం ఎస్‌పీడీ దృష్టికి.. : ప్రాథమికంగా దృష్టికి వచ్చిన ఈ అక్రమాల విషయాలను కలెక్టర్ రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్‌కు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలిసింది. మరోవైపు ఈ పనులపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ట్రాన్స్‌కో పర్యవేక్షక ఇంజినీర్‌ను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మ తయారు చేసినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు