నకిలీ బంగారం కలకలం

2 Oct, 2019 10:23 IST|Sakshi

కర్ణాటక నుంచి సిరిసిల్లకు..

రూ.10 లక్షలు స్వాహా చేసిన దళారీ

మింగలేక.. కక్కలేక బాధితుల పరిస్థితి

సాక్షి, సిరిసిల్ల: నకిలీ బంగారంతో జిల్లావాసులు మోసపోయిన సంఘటన వెలుగుచూసింది. రెండున్నరఏళ్లక్రితం ఇలాంటి ఉదాంతం ఒకటిచోటుచేసుకోగా పోలీసులు నిఘా వేసి నిందితులను పట్టుకున్నారు. తాజాగా బంగారం ఆశచూపి రూ.10 లక్షలు టోపీ పెట్టిన ఘటన జరిగింది. బాధితులందూ రాజన్న సిరిసిల్ల జిల్లావాసులుకావడం ఒకే కుటుంబానికి చెందిన వారిగా చర్చ జరుగుతోంది. కర్ణాటకు చెందిన కొందరు జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో వివిధ వస్తువుల అమ్మకానికి వచ్చి సామాన్యులను బంగారం పేరిట మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలంలో తులం బంగారం రూ.20 వేలకు ఇస్తామని నమ్మించినట్లు సమాచారం.

దాదాపు రూ.40 వేలున్న బంగారం సగం రేటుకు వస్తుందనే ఆశతో జిల్లాలోని పలువురు దాదాపు రూ.6 నుంచి రూ.10 లక్షలు ఇక్కడ నుంచి కర్ణాటకు వెళ్లి బంగారాన్ని కొన్నట్లు ప్రచారం సాగుతోంది. బంగారం చేతులు మారే క్రమంలో నకిలీ బంగారం అమ్మే వారు పోలీసులు వస్తున్నారని అక్కడి నుంచి పారిపోగా, కొన్ని నాణేలు తీసుకున్న జిల్లావాసులు వెనుదిరిగినట్లు తెలిసింది. ఇక్కడికి వచ్చాక పరిక్షిస్తే నకిలీ అని తేలడంతో బంగారం కొనడానికి బాధ్యుడైన వ్యక్తిని డబ్బు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులందినట్లు తెలిసింది. అత్యాశకుపోయిన జిల్లావాసులు మోసపోయిన విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు. బంగారం పేరిట మోసం జరిగిందని ప్రచారం తీవ్రంగా జరుగుతోంది. 

సూత్రధారిది ఇక్కడే.. 
బంగారం కోసం కొందరు కర్ణాటక వెళ్లడం వరకు వాస్తవమే. కానీ ఈ నాటకీయ విధానానికి సూత్రధారి బాధితులకు దగ్గరివాడే. కర్ణాటకలో ఒక బినామీని సృష్టించి అమాయకుల నుంచి డబ్బు దండుకోవడానికి చేసిన ప్రయత్నంగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాధితులు న్యాయంకోసం వచ్చారు. వారికి తగిన సాయం చేసి చట్టపరిధిలో ముందుకెళ్తాం.
– రాంచంద్రం, ఎస్సై, వీర్నపల్లి మండలం 

>
మరిన్ని వార్తలు