సబ్సిడీ విత్తనాలు.. 12 లక్షల క్వింటాళ్లు

6 Feb, 2018 02:40 IST|Sakshi

      వచ్చే సీజన్‌కు వ్యవసాయశాఖ కార్యాచరణ  

     ఖరీఫ్‌కు 7.5 లక్షలు, రబీకి 4.5 లక్షల క్వింటాళ్లు  

     2017–18 ఏడాది కంటే 2 లక్షల క్వింటాళ్లు అధికం 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే వ్యవసాయ సీజన్‌కు 12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఆయా విత్తనాలను ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై సరఫరా చేయనుంది. ఖరీఫ్‌కు 7.5 లక్షలు, రబీకి 4.5 లక్షల విత్తనాలను సరఫరా చేయనుంది. 2017–18 వ్యవసాయ సీజన్‌లో 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2018–19 సీజన్‌లో అదనంగా 2 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయాలని నిర్ణయించింది.

వచ్చే ఖరీఫ్‌ నుంచి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి పథకాన్ని వర్తింప చేయనున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. ప్రభు త్వ అంచనా ప్రకారం 1.62 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. సాగు పెరుగనున్న క్రమం లో విత్తన పరిమాణం కూడా పెంచినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 17 రకాల విత్తనాలను ఖరీఫ్, రబీలకు ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయనుంది. వీటిని 33 నుంచి 50 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందిస్తుంది.  

రైతు కోరుకునే విత్తనాలేవీ? 
ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే కొన్ని రకాల విత్తనాలను రైతులు పెద్దగా కోరుకునే పరిస్థితి లేదు. మొక్కజొన్నలో కొన్ని హైబ్రిడ్‌ రకాలకు బాగా డిమాండ్‌ ఉంది. ప్రభుత్వం సరఫరా చేసే మొక్కజొన్నకు డిమాండ్‌ లేకపోవడంతో రైతులు పెద్దగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు.  

మరిన్ని వార్తలు