రాలుతున్న రైతన్నలు

23 Aug, 2014 04:23 IST|Sakshi
రాలుతున్న రైతన్నలు

ఏళ్లుగా సాగు చేస్తున్నా కలిసిరాని వ్యవసాయం. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట ఆదుకోకపోగా.. నట్టేట ముంచుతోంది. ఈ సారీ అన్నదాతను ప్రకృతి పగబట్టింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మొక్కలు ఎండిపోతున్నాయి. బావిలో ఉన్న నీటిని పంటకు పారిద్దామంటే కరెంటు కోతలు అడ్డుకుంటున్నాయి. కళ్లముందే పంట మట్టిపాలవడం.. సాగుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతన్న చితికిపోతున్నాడు. మనోవేదనతో ఆత్మహత్యను ఆశ్రయిస్తున్నాడు. ఒక్కరోజే జిల్లాలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
 
కమలాపూర్ : మండలకేంద్రానికి చెందిన ఏకు రాజు అలియాస్ పరకాల రాజు(35) సెంట్రింగ్ కూలీగా పనిచేసుకుంటూనే కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది నాలుగెకరాలు భూమి కౌలు తీసుకుని పత్తి పంట వేశాడు. అకాలవర్షాలకు పంటచేతికొచ్చే దశలో నష్టపోయింది. ఈ ఏడాది సైతం నాలుగెకరాల కౌలు భూమిలో మళ్లీ పత్తి వేశాడు. పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. వర్షాలు లేక, కరెంటుకోతలతో పంటంతా దెబ్బతింటోంది.

ఈసారి కూడా పంట చేతికి రాకపోతే అప్పులెలా తీర్చాలని మథనపడుతూ శుక్రవారం మధ్యాహ్నం పత్తి చేను వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. గ్రామశివారులో క్రిమిసంహారకమందు తాగాడు. ఎంతకూ రాకపోయే సరికి కుటుంబసభ్యులు వెతుక్కుంటూ వెళ్లగా శివారులో శవమై కనిపించాడు. రాజుకు భార్య వనిత, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతదేహం వద్ద బంధువులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వనిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్పాల్‌సింగ్ తెలిపారు.
 
కమాన్‌పూర్ : కమాన్‌పూర్ మండలం గుండారం పరిధి రాజాపూర్‌కు చెందిన చొప్పరి నర్సయ్య(45) అనే కౌలురైతు తన బంధువులకు చెందిన రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. వర్షాలు కురవకపోవడంతో పంట ఎదగకుండా వాడిపోతోంది. పంట చేతికొచ్చే అవకాశం లేదని మనస్తాపం చెందిన ఆయన గురువారం రాత్రి ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి కరీంనగర్ తరలించగారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. నర్సయ్యకు భార్య నర్సమ్మ, కూతురు శ్యామల ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై అన్వర్ తెలిపారు.
 
కాటారం : కాటారం మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన చిలుముల సమ్మయ్య(47) గతేడాది తన మూడెకరాల పొలంలో వరి సాగు చేశాడు. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాడు. పెట్టుబడి కోసం తెలిసినవారి వద్ద రూ.2 లక్షల మేర అప్పు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో అప్పు కట్టలేకపోయాడు. పది నెలల క్రితం కూతురు పెళ్లి చేయగా మరో రూ.3 లక్షలు అప్పు అయింది. ఈ ఏడాది సైతం మరో రూ.లక్ష అప్పు తెచ్చి పంట వేశాడు.

వర్షాభావ పరిస్థితులతో పంట సరిగా ఎదగకపోవడంతో మొత్తం రూ.6 లక్షల అప్పు ఎలా తీర్చాలని మనస్తాపం చెందిన సమ్మయ్య గురువారం రాత్రి బయటకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగి ఇంటికి వచ్చాడు. కుటుంబసభ్యులు గమనించి 108 ద్వారా మహదేవపూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సమ్మయ్యకు భార్య అంకమ్మ, కూతుళ్లు వనజ, సృజన, కుమారుడు శివప్రసాద్ ఉన్నారు.

మరిన్ని వార్తలు