ఉసురుతీసిన పెద్దమనుషుల తీర్పు

23 Jun, 2018 12:59 IST|Sakshi
లచ్చిరాం వ్యవసాయ భూమికి దారి ఇవ్వకుండా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసిన దృశ్యం ( ఇన్‌సెట్‌లో)

పెద్దమనుషుల తీరుతో మనస్తాపం 

ఉరివేసుకొని బలవన్మరణం

దారావత్‌ తండాలో ఘటన 

మహబూబాబాద్‌ రూరల్‌: పక్కనున్న వ్యవసాయ భూములకు వెళ్లే దారి తీసేందుకు తన వ్యవసాయ భూమిలో నుంచి పెద్దమనుషులు 17 గుంటల భూమి తీశారని మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ మండలం మాధవాపురం గ్రామశివారు దారావత్‌తండాలో శుక్రవారం జరిగింది. కురవి ఎస్సై ఎన్‌.నాగభూషణం, మృతుడి భార్య దారావత్‌ లక్ష్మి, స్థానికుల కథనం ప్రకారం... మహబూబాబాద్‌ మండలం మాధవాపురం శివారు దారావత్‌తండాకు చెందిన దరావత్‌ లచ్చిరాం(50)కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పక్కనే ఇదే తండాకు చెందిన అతడి దాయాదులు దరావత్‌ లింగన్న, మోహన్, రమేష్, కస్నాకు వరుసగా భూములు ఉన్నాయి. వారి భూముల మధ్య లచ్చిరాం భూమి కూడా కొంత ఉంది. అయితే ఆయా భూములకు వెళ్లేందుకు దారి కోసం భూమి ఇవ్వాలని వారు రెండేళ్లుగా కోరుతున్నారు. ఈ విషయంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. మొదటిసారి పంచాయితీలో పెద్దమనుషులు లచ్చిరాం భూమిలో నుంచి ఒక గుంటకు బదులు నాలుగు గుంటల భూమిని లింగన్న భూమికి వెళ్లే దారి కోసం కేటాయించారు. ఇటీవల పంచాయితీలో మళ్లీ లచ్చిరాంకు చెందిన 17 గుంటల భూమిని దారి కోసం తీశారు. దీంతో తన భూమిని ఎక్కవగా దారి కోసం కేటాయిస్తూ పెద్ద మనుషులు అన్యాయం చేశారంటూ మనోవేదనకు చెంది శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

గతంలో పురుగుల మందు తాగి...
దరావత్‌ లచ్చిరాం గతంలో కూడా ఇదే విషయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దాయాదులు, ఇతర రైతులైన దరావత్‌ మోహన్, దరావత్‌ లింగన్న, దరావత్‌ రమేష్, దరావత్‌ కస్నా, దరావత్‌ వీరన్నతోపాటు పెద్ద మనుషులైన దరావత్‌ హరియా, దరావత్‌ శంకర్‌ ఏడుసార్లు పంచాయితీలు నిర్వహించి లచ్చిరాంకు రూ.60 వేల వరకు ఖర్చు చేయించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అప్పట్లో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు.  ఇందుకు రూ.80 వేలు ఖర్చయ్యింది. దారి కోసం భూమి కోల్పోవడం, పెద్ద మనుషుల తీరుతో మనోవేదనకు గురై ఇప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య లక్ష్మి వాపోయింది. తమ భూమిలోకి వెళ్లకుండా కావాలని దారావత్‌ మోహన్, దారావత్‌ బీక్యా దారిలో ముళ్లకంప, ఇనుప కంచె వేశారని ఆవేదన చెందింది. లచ్చిరాం భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 

మరిన్ని వార్తలు