కూరగాయల రైతుకు నష్టాల దిగుబడి

3 May, 2020 02:27 IST|Sakshi

దిగుబడులున్నా.. సరుకు అమ్ముకునే పరిస్థితి కరువు

లాక్‌డౌన్‌తో రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లు మూత

గిట్టుబాటు కాక పొలంలోనే పంటను వదిలేస్తున్న రైతులు

సాక్షి, హైదరాబాద్‌: రైతుల రోజువారీ ఆదాయ మార్గమైన కూరగాయల సాగు సంక్షోభంలో పడింది. సాగు పనులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. మార్కెట్లో అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దిగుబడులు సంతృప్తికరంగా ఉన్నా, ధరలు పతనం కావడంతో లాభాలు మడిలోనే ఆవిరవుతున్నాయి. టమాట, బీర, బెండ, దొండ, దోస తదితర పంట దిగుబడులు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో కూరగాయల ధరలు భగభగమండేవి. పెళ్లిళ్లు, శుభకార్యాలతో డిమాండ్‌ బాగా ఉండేది. అయితే, కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావాలతో కూరగాయల విక్రయాలకు గండిపడింది. రైతుబజార్లలో కూరగాయల మార్కెట్లు మూతబడ్డాయి. దాదాపు నెలన్నరగా రైతులు దిగుబడులను సగానికి సగం తగ్గిస్తూ విక్రయిస్తుండడంతో నష్టాలపాలవుతున్నారు. రవాణా చార్జీలు సైతం గిట్టుబాటు కాక దిగాలు పడుతున్నారు.

కొనేవారు లేక..
కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లకు తాళం పడింది. ఇప్పటివరకు కూరగాయల దిగుబడులను నేరుగా రైతుబజార్‌కు తెచ్చి హోల్‌సేల్, రిటైల్‌గా విక్రయించే రైతులకు తాజా పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. దిగుబడులను ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితి నెలకొంది. రిటైల్‌ విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చినా.. రైతులకు ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. ఇంటింటి విక్రయాలు జరిపినప్పటికీ కరోనా భయంతో కొనుగోళ్లకు వినియోగదారులు ముందుకు రావట్లేదు. దీంతో మధ్యవర్తులకు దిగుబడులను అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగుచేసిన రైతులు కూలీలతో దిగుబడులను వేరు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో కూలీలకు రోజుకు సగటున రూ.500 వరకు చెల్లించాలి. అయితే కూలీలకు చెల్లించే మొత్తం కూడా దిగుబడుల విక్రయంతో దక్కడం లేదు. దీంతో కొందరు రైతులు గిట్టుబాటు కావడం లేదని పంట దిగుబడులను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు కావడం లేదనే కారణంతో రైతులు కూరగాయల సాగును వదిలేయడమే మంచిదనే భావనతో ఉన్నారు. అదే జరిగితే ఇబ్బందులు తప్పవు. కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గితే డిమాండ్‌కు సరిపడా దిగుబడులు మార్కెట్లోకి రావు. దీంతో ధరలు పెరిగిపోతాయి.

రాబడి 60 శాతం తగ్గింది
అరెకరంలో టమాట, మరో అరెకరంలో దొండ సాగుచేస్తున్నా. మరో రెండు మడుల్లో గోకర, బీర వేశాం. దిగుబడి బాగుంది. కానీ ధరల్లేవు. గతేడాది ఇదే సమయంలో రోజుకు సగటున రూ.1,000 రాబడి వచ్చేది. కానీ ఇప్పుడు రూ.400 దాటడంలేదు. ఇది పెట్టుబడికే సరిపోవట్లేదు. మా కుటుంబసభ్యులతోనే సాగు పనులు చేస్తున్నాం. కూలీలను పెట్టుకుంటే నష్టాలు తప్ప పెట్టుబడి కూడా దక్కదు.    – సిలువేరు మల్లయ్య, రైతు, సర్వేల్, యాదాద్రి జిల్లా

పంటను పొలంలోనే వదిలేశా..
రెండెకరాల్లో టమాట, ఎకరంన్నరలో క్యాబేజీ, మరో రెండెకరాల్లో మునగ పంటలు వేశా. కూరగాయలకు ధరల్లేకపోవడం, కూలీలను పెట్టుకుంటే గిట్టుబాటు కాదని పంటంతా పొలాల్లోనే వదిలేశా. పొలం పక్కనున్న వారికి అవసరమైన కూరగాయలను తెంపుకోమని చెప్పా. – రొక్కం భీంరెడ్డి, రైతు, తుర్కయాంజాల్, రంగారెడ్డి జిల్లా

మరిన్ని వార్తలు