ఆహారధాన్యాలు.. 27.74 కోట్ల టన్నులు

1 Mar, 2018 04:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆహారధాన్యాల ఉత్పత్తి అంచనా భారీగా పెరిగింది. దేశంలో 2017–18 ఖరీఫ్, రబీ సీజన్‌లో ఆహారధాన్యాలు రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతాయ ని కేంద్రం అంచనా వేసింది. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కేంద్ర వ్యవసాయశాఖ రెండో అంచనా నివేదికను బుధవారం విడుదల చేసింది. 2016–17 సీజన్‌లో 27.51 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, 2017–18 సీజన్‌లో 27.74 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతాయని తెలిపింది. గతేడాది కంటే 23 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి కానున్నాయి.

అందులో వరి ఉత్పత్తి గతేడాది 10.97 కోట్ల టన్నులు కాగా, ఈసారి 11.10 కోట్ల టన్నులు దిగుబడి రానుంది. పప్పుధాన్యాల ఉత్పత్తి గతేడాది 2.31 కోట్ల టన్నులు కాగా, ఈసారి 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కానున్నాయి. గతేడాది నూనెగింజల ఉత్పత్తి 3.12 కోట్ల టన్నులు కాగా, ఈసారి 2.98 కోట్ల టన్నులకు పడిపోనున్నాయి. పత్తి ఉత్పత్తి గతేడాది 3.25 కోట్ల బేళ్లు కాగా, ఈసారి 3.39 కోట్ల బేళ్లు ఉత్పత్తి కానుందని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 54.60 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, కేవలం 50.29 లక్షల టన్నులకే పరిమితమైంది.

వరి ఉత్పత్తి లక్షం 32.47 లక్షల టన్నులు కాగా, దిగుబడి 30.42 లక్షల టన్నులకు పడిపోయిందని వెల్లడించింది. ఇక పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 2.94 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఉత్పత్తి గణనీయంగా 3.71 లక్షల టన్నులకు చేరింది. అందులో కంది ఉత్పత్తి లక్ష్యం 2.03 లక్షల టన్నులు కాగా, 2.84 లక్షలకు చేరింది. మొక్కజొన్న ఉత్పత్తి లక్ష్యం 18.64 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, 15.70 లక్షల టన్నులకు పడిపోయింది.

పెసర 64 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా, 59 వేల టన్నులకు పడిపోయింది. మినుముల ఉత్పత్తి లక్ష్యం 26 వేల టన్నులు కాగా, నూటికి నూరు శాతం ఉత్పత్తి అయింది. ఖరీఫ్‌లో నిరాశపరిచిన ఆహారధాన్యాల ఉత్పత్తి, రబీలో పుంజుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నివేదిక చెబుతోంది. రాష్ట్రంలో రబీలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 36.28 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, 44.72 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. అందులో వరి ఉత్పత్తి లక్ష్యం 25.64 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, 35.16 లక్షల టన్నులు అవుతుందని అంచనా వేసింది. 

మరిన్ని వార్తలు