నేడు సచివాలయం, ‘అసెంబ్లీ’కి శంకుస్థాపన 

27 Jun, 2019 04:20 IST|Sakshi
కొత్త సచివాలయ భవనం శంకుస్థాపన కోసం తీసిన గుంత

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం శంకుస్థాపన చేయనున్నారు.  ఉదయం 11 గంటలకు సచివాలయంలోని డీ–బ్లాక్‌ వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులో కొత్త భవన నిర్మాణానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 12 గం.కు ఎర్రమంజిల్‌ ప్యాలెస్, ఆర్‌అండ్‌బీ కార్యాలయ భవన సముదాయం మధ్య ఖాళీస్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిస్తారు. చరిత్రాత్మక ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. 

కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్‌పర్సన్లను ఆహ్వానించారు.  మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ వీరికి విందు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగే పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై అధ్యయనం కోసం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌ గౌడ్‌తో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై చర్చించనుందని అధికారవర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు