మైనార్టీ బాలుర గురుకులంలో కలకలం!

25 Oct, 2019 10:29 IST|Sakshi
విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న సీఐ మాధవి  

పాఠశాల నుంచి నలుగురు విద్యార్థుల పరార్‌

ఇప్పల్‌నర్సింగాపూర్‌ సమీపంలో దొరికిన వైనం

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌): హుజూరాబాద్‌లోని బాలుర మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి నలుగురు వి ద్యార్థులు పారిపోయిన ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా వంగర గ్రామ పరిధిలోని పీవీ నగర్‌కు చెందిన షేక్‌ అక్తర్, షేక్‌ రఫీ, షేక్‌ ఇజ్రాయిల్, షేక్‌ షకిల్‌ హుజూరాబాద్‌లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. గురువారం వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేచి పాఠశాల గోడ దూకి పారిపోయారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్‌ తిరుపతిరెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించగా వారు పాఠశాలకు చేరుకున్నారు.

పాఠశాలలోని సీసీ కెమెరా పుటేజీలను సీఐ మాధవి పరిశీలించగా వేకువజామున 5.20 గంటల సమయంలో వెళ్లినట్లు, వరంగల్‌–కరీంనగర్‌ జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా విద్యార్థులు కాలినడకన వెళ్లినట్లుగా గుర్తించారు. మధ్యాహ్నం ఇప్పల్‌నర్సింగాపూర్‌ సమీపంలోని తాటి వనం నుంచి విద్యార్థులు కాలి నడకన వెళ్తున్నట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారిని పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ప్రిన్సిపాల్‌ సార్‌ కొట్టడంతోనే స్కూల్‌ నుంచి పారిపోయామని విద్యార్థులు సీఐ మాధవికి వివరించారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సీఐ తెలిపారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు