‘గాంధీ’లో ‘నిర్భయ’ సెల్

29 Nov, 2014 00:21 IST|Sakshi

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ‘నిర్భయ’సెల్  ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆస్పత్రి పాలనా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలిసింది. అత్యాచారాలు,  వేధింపులకు గురైన మహిళలకు అన్నివిధాలా వైద్యసేవలతోపాటు సహాయసహకారాలు అందించేందుకు  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ సెల్‌లో స్త్రీవైద్యనిపుణురాలు, పోలీస్ అధికారి, సైక్రియాట్రిస్ట్ (కౌన్సిలర్)తోపాటు చైల్డ్ హెల్త్ వెల్ఫేర్‌కు చెందిన మరో అధికారి సభ్యులుగా ఉంటారు.  నిర్భయ చట్టం ద్వారా నమోదైన కేసుల్లోని బాధితులను ఈ సెల్ సభ్యులు విచారించి, బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతారు. ‘వన్ స్టాప్ క్రైసెస్ సెంటర్ ఫర్ ఉమెన్’ పేరిట ఏర్పాటవుతున్న ఈ సెల్‌కు త్వరలోనే పేరు మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి నిర్భయసెల్‌గా వ్యవహరిస్తున్నారు.

డిసెంబర్ 1వతేదీన సీఎం  కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు సెల్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను గాంధీ ఆస్పత్రిలో కల్పించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ పి. ధైర్యవాన్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు