ఆదర్శ వివాహాలకు నజరానా పెంపు

14 Dec, 2019 11:25 IST|Sakshi

కులాంతర వివాహం చేసుకున్న

జంటకు రూ.2.50 లక్షల ప్రోత్సాహకం

సాక్షి, తాండూరు(రంగారెడ్డి) : కులాంతర వివాహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తోంది. ఎస్సీలకు చెందిన యువతీ, యువకులను  వివాహం చేసుకున్న వారికి నజరానా పెంచింది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాలో ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహకాల అమలు బాధ్యతలను జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారులకు అప్పగించారు. గతంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ.50 వేల ప్రోత్సాహకం అందేది. ప్రస్తుతం రూ.2.50 లక్షలకు పెంచారు.

కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు సమాజంలో   పరిమాణాలను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎస్సీలకు బాసటగా నిలుస్తోంది. జంటకు రూ.2.50లక్షల ప్రోత్సాహక అవార్డును అందించనున్నారు. ఇందుకు సంబంధిత శాఖ అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న జంటలు ప్రోత్సాహకం పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ ఈ పీఏఎస్‌ఎస్‌.సీజీజీ జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 

అర్హతలివీ..
► ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వధువు, లేదా వరుడు కులాంతర వివాహం చేసుకొని ఉండాలి.
► వధువు,  వరుడు రూ.2లక్షలలోపు ఆదాయం కలిగి ఉండాలి.
►  గత అక్టోబర్‌ 30 తర్వాత చేసుకున్న కులాంతర వివాహాలకు ఈ ఇన్సెంటివ్‌ అవార్డును అందించనున్నారు.

కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు..
► కులాంతర వివాహ ప్రోత్సాహక అవార్డుకు ధ్రువీకరణ పత్రాలు తప్పని సరిగా జతపర్చాలి. ఇద్దరికీ సంబంధించిన ఆధార్‌కార్డులు జత చేయాలి.
►  వధూవరులు బ్యాంకులో జాయింట్‌ అకౌంట్‌ కలిగి ఉండాలి.
► వధూవరుల కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
►   వివాహం జరిగినట్లు రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
►   కులాంతర వివాహం చేసుకున్నట్లు సాక్షుల ఆధార్‌ కార్డులు సైతం జత చేయాలి.
►  వధూవరుల పూర్తి చిరునామాను పొందు పర్చాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
వికారాబాద్‌ జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన యువతి యువకులు కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం నుంచి రూ.2.50లక్షల ప్రోత్సాహక అవార్డు అందుతుంది. గత అక్టోబర్‌ 30 తర్వాత వివాహం చేసుకున్న జంటలు అర్హులు. వివాహ రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ పత్రంతో పాటు కుల, ఆదాయ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విచారణ చేసిన అనంతరం నజరానాను వారి జాయింట్‌ అకౌంట్‌లో జమ చేస్తాం.
– విజయలక్ష్మి, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి, వికారాబాద్‌ జిల్లా

మరిన్ని వార్తలు