పర్యాటకానికి మొండిచెయ్యి!

16 Mar, 2018 02:51 IST|Sakshi

రూ.500 కోట్లు అడిగితే.. రూ.107 కోట్లు కేటాయించిన సర్కారు 

పురావస్తు శాఖకు నామమాత్రంగా రూ.కోటి

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకట్టుకోగలిగే ప్రాంతాలు ఉన్నప్పటికీ... వసతుల కరువు, ప్రచార లేమితో ప్రయోజనం ఉండడం లేదు. అయినా పర్యాటకంపై దృష్టి పెట్టని ప్రభుత్వం.. తాజా బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు కేటాయించింది. పర్యాటక శాఖకు కేవలం రూ.107 కోట్లతో సరిపెట్టింది. ఇందులోనూ ప్రగతి పద్దు కింద కేటాయించిన నిధులు రూ.80 కోట్లే. కనీసం రూ.500 కోట్లు ఇవ్వాలని పర్యాటక శాఖ విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదు. వృద్ధ కళాకారుల పింఛన్‌కు రూ.6.75 కోట్లు, సాంస్కతిక అకాడమీలకు సాయంగా రూ.4 కోట్లు, సాంస్కృతిక ఉత్సవాలకు రూ.15 కోట్లు, తెలంగాణ సాంస్కృతిక సారథికి రూ.18 కోట్లు కేటాయించింది. 

పురావస్తు శాఖకు నామమాత్రమే 
రాష్ట్రంలో ఎన్నో చారిత్రక విశిష్టతలున్న ప్రాంతాలు, నిర్మాణాలు ఉన్నా.. ఆలనాపాలనా లేక దెబ్బతింటున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన పురావస్తు శాఖ నిధులు, సిబ్బంది లేక నిస్తేజంగా మారింది. ఇలాంటి సమయంలోనూ పురావస్తు శాఖను పట్టించుకోని ప్రభుత్వం.. తాజా బడ్జెట్‌లో నామమాత్రంగా రూ.కోటి మాత్రమే కేటాయించింది. గతేడాది కూడా ఇలాగే తక్కువ నిధులు ఇచ్చినా.. అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకుని అదనంగా నిధులు విడుదల చేయించుకున్నారు. ఆ నిధులతో కొత్త ప్రాంతాల్లో చారిత్రక తవ్వకాలు, మ్యూజియంలలో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు