లాడ్జీలో ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం ఆత్మహత్య

22 Nov, 2019 08:16 IST|Sakshi
మోసిన్‌ (ఫైల్‌)

జీవితంపై విరక్తితో జహీరాబాద్‌లో బలవన్మరణం 

మృతుడు అల్లాపూర్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 

బషీరాబాద్‌ మండలం క్యాద్గిరాలో విషాదం

సాక్షి, జహీరాబాద్‌: మతి స్థిమితం సరిగ్గా లేక మానసికంగా బాధపడుతున్న వికారాబాద్‌ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జహీరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జహీరాబాద్‌ టౌన్‌ ఎస్‌ఐ– 2 విఠలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్‌ మండలం క్యాద్గిరాకు చెందిన మోసీన్‌ (34) అల్లాపూర్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడికి కొన్ని రోజుల నుంచి మతి స్థిమితం సక్రమంగా లేక పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎక్కడెక్కడో తిరిగేవాడు.

ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వికారాబాద్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి జహీరాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న తిరుమల లాడ్జిలో రూమ్‌ అద్దెకు తీసుకున్నాడు. తనకు జీవితంపై విరక్తి వచ్చిందని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు మెసేజ్‌ పెట్టి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న అబ్దుల్‌ మోహిజ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య బషీరాబాద్‌ ఉర్దూ మాధ్యమం పాఠశాలలో వలంటీర్‌గా పని చేస్తోంది. 

కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరు 
బషీరాబాద్‌: జహీరాబాద్‌లో మోసీన్‌(38) ఆత్మహత్యకు పాల్పడడంతో అతడి స్వగ్రామం క్యాద్గిరలో విషాదం అలుముకుంది. జహీరాబాద్‌లో పోలీసులు మృతదేహం అప్పగించడంతో గురువారం రాత్రి క్యాద్గిరకు చేరుకుంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధ్యాయుడి ఆత్మహత్యతో బషీరాబాద్‌ మండల ఉపాధ్యాయులు గ్రామానికి చేరుకొని మోసీన్‌కు నివాళులర్పించారు.   

మరిన్ని వార్తలు