ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమ చేయాలి

13 Jun, 2018 13:52 IST|Sakshi
ధర్నాలో మాట్లాడుతున్న ఇనుగాల పెద్దిరెడ్డి 

సాక్షి, టవర్‌సర్కిల్‌ : ధాన్యం డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మొదట సర్కస్‌ గ్రౌండ్‌ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. సుమారు గంటపాటు ధర్నా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేని దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు.

ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్‌ ధరలు 2014 నాటి స్థాయిలోనే ఉన్నా.. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను భారం కారణంగా ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రవీణ్, నాయకులు వెంకటేశ్వర్లుగౌడ్, కళ్యాడపు ఆగయ్య, ఎడ్ల వెంకటయ్య, జాడి బాల్‌రెడ్డి, కొరటాల శివరామకృష్ణ, ఆడెపు కమలాకర్, దామెర సత్యం, దూలం రాధిక, అనసూర్యనాయక్, కరుణాకర్‌రెడ్డి, తీట్ల ఈశ్వరి, ఆనందరావు, కిశోర్, గట్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రొడ్డ శ్రీనివాస్, తీగుట్ల రమేశ్, నూజెట్టి వాణి, రవీందర్, ఇందు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు