భారీ వేదిక.. 300 మందికి చోటు

29 Aug, 2018 02:21 IST|Sakshi
ప్రగతి నివేదనకు సిద్ధమవుతున్న సభావేదిక

ప్రగతి నివేదన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు 

ఏర్పాట్లను పర్యవేక్షించిన కేటీఆర్, నాయిని

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్‌ 2న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన’సభకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. దూరంలోనున్న సభికులకు కనిపించే విధంగా భారీ వేదికను నిర్మిస్తున్నారు. దీనికిగాను సభాప్రాంగణ విస్తీర్ణం పెద్దగా ఉండేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ, పట్టా భూములను చదును చేస్తున్నారు. వేదికను 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై 300 మంది ఆసీనులయ్యే విధంగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు వేదికపై చోటు కల్పించనున్నారు. సుమారు 500 ఎకరాల మైదానంలో భారీ ఎల్‌సీడీ స్క్రీన్లు, సరైన వెలుతురు కోసం ఫ్లడ్‌లైట్లు, భద్రత కోసం బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. 15 ఫైరింజన్లు తీసుకుంటున్నారు. వీటి కోసం పార్టీ నిధి నుంచి చెల్లించారు. దీనికి భారీగా కరెంటు అవసరం కావడంతో రూ.30 లక్షలను విద్యుత్‌ శాఖకు చెల్లించనున్నారు.  

సభాస్థలికి రోడ్లు... అద్దె వాహనాలు... 
సభకు సుమారు 25 లక్షల మందిని తరలిస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. దీనికోసం ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, వ్యాన్‌లు, ప్రైవేటు స్కూల్‌ బస్సులు వంటి 24 వేల వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. వేదికకు ఎదురుగా 50 వేల కుర్చీలను ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఏర్పాట్లలో వేగం పెంచండి...: కేటీఆర్‌ 
సభాస్థలి, రోడ్ల నిర్మాణం వంటి పనుల్లో వేగం పెంచాలని పార్టీ ముఖ్యనేతలను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పనులను పరిశీలించారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్‌ రాజు, కార్పొరేషన్‌ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పని విభజన చేసుకుని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 

ప్రయాణాలు వద్దు: ప్రగతి నివేదన సభ కోసం దాదాపు అన్ని వాహనాలను కిరాయికి తీసుకున్నామని కేటీఆర్‌ చెప్పారు. ఆదివారం కావడం వల్లే ఈ సభ నిర్వహిస్తున్నామని, సామాన్యులెవరూ ఆ రోజు ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు