విద్యా సంస్థల్లో హరితహారం

22 Aug, 2018 11:01 IST|Sakshi
మొక్కలు నాటుతున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి  

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ పి.కె.ఝా  

మెదక్‌ అర్బన్‌ : హరిత పాఠశాల – హరిత తెలంగాణ నినాదాంతో తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో ఈనెల 25న హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించాలని అటవీ శాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ పి.కె.ఝా జిల్లా కలెక్టర్లకు సూచించారు.  మంగళవారం కలెక్టర్లు, విద్యాశాఖ, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌ కన్జర్వేటర్‌ పి.కె.ఝా మాట్లాడుతూ హరిత పాఠశాల – హరిత తెలంగాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. నాల్గో దశలో భాగంగా విద్యాసంస్థల్లో ’హరిత పాఠశాల – హరిత తెలంగాణ‘ పేరుతో ఈనెల 25న ఘనంగా నిర్వహించాలన్నారు.

విద్యాశాఖలో హరితహారం నిర్వహించేందుకు విద్యార్థులతో గ్రీన్‌ బ్రి గేడ్‌లను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిలో భాగంగా అటవీ శాఖ అధికారులు గ్రీన్‌ బ్రిగేడ్‌ల కోసం దుస్తులు, టోపీలు, రుమాళ్ళు సమకూర్చడం జరుగుతుందని ఝా స్పష్టం చేశారు. విద్యాశాఖ పరిధిలోని పాఠశాల, ఉన్నత విద్య, కేజీబీవీ, మోడల్‌ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు,  యూనివర్సిటీల్లో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు.  కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో, వసతి గృహాల్లో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో సీతారామరావు, డీఆర్వో రాములు, డీఎఫ్‌వో పద్మజారాణి,  రాజిరెడ్డి, పాల్గొన్నారు. 

ప్రజాసమస్యలను పరిష్కరించాలి

మెదక్‌ అర్బన్‌ :  ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో నిత్యం రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు అధికంగా వస్తున్నాయని తమ వద్దకు వచ్చే ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మరిన్ని వార్తలు