ఏ బాధ్యతనైనా నిర్వర్తిస్తా..

30 Jun, 2014 03:31 IST|Sakshi
ఏ బాధ్యతనైనా నిర్వర్తిస్తా..

ఒకప్పుడు విప్లవాలకు కేంద్ర బిందువు.. తెలంగాణ ఉద్యమానికి మూలంగా నిలిచిన కాకతీయ యూనివర్సిటీలో పీజీ ఎకనామిక్స్ విభాగం మొదటి బ్యాచ్ విద్యార్థిగా చేరిన తుమ్మల పాపిరెడ్డి ఆ తర్వాత ఇక్కడే అధ్యాపకుడిగా చేరి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా యూనివర్సిటీలో పలు పరిపాలన పదవులు చేపట్టిన ఆయన 2009 సంవత్సరం నుంచి టీ జేఏసీ జిల్లా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అటు యూనివర్సిటీలో పాఠాలు బోధిస్తూనే.. ఇటు తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి విశేష కృషి చేసిన కేయూ ఎకనామిక్స్ సీనియర్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు.
 
ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ మాట్లాడగా.. కేయూలోనే పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసిన తాను ఇక్కడే ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించి, ఉద్యోగ విరమణ చేయడాన్ని మరిచిపోలేని అనుభూతిగా వర్ణించారు. మూడున్నర దశాబ్దాల పాటు కేయూతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కేయూలో క్షీణిస్తున్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసిన పాపిరెడ్డి.. టీ జేఏసీ చైర్మన్‌గా కొనసాగుతూనే ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పిస్తే ప్రభుత్వంతో కలిసి ఏ బాధ్యత నిర్వర్తించేందుకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...    - కేయూ క్యాంపస్
 
 ఎకనామిక్స్‌లో మొదటి బ్యాచ్
కాకతీయ యూనివర్సిటీ పీజీలో ఎకనామిక్స్ వి భాగం ప్రారంభించిన 1977లో మొదటి బ్యాచ్‌లో నేను చేరాను. అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ విధిం చగా అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. యూనివర్సిటీలోమౌలిక వసతులు లేని కాలంలో పీజీ పూర్తి చేసి ఎంఫిల్ 1980లో పూర్తిచేశాను. ఆ తర్వాత అధ్యాపకుడిగా పనిచేస్తుండగా, 1988లో పీహెచ్ డీ అవార్డు అయింది. నేను అధ్యాపకుడిగా పనిచేస్తున్న కాలంలో కేయూ విప్లవాలకు కేంద్రంగా ఉండగా, 1980వ దశకంలో పీపుల్స్‌వార్, ఆర్‌ఎస్ యూ, లెఫ్ట్‌భావాలు కలిగిన అధ్యాపకులు, విద్యార్థులే ఎక్కువగా ఉండేవారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వంతో పాటు సామాజిక మార్పు జరగాలనే ఆకాంక్షకు అనుగుణంగా అధ్యాపకులు కూడా వ్యవహరించేవారు.
 
తెలంగాణ కోసం..
కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకుల సంఘం అధ్యక్షుడిగా రెండు సార్లు, ప్రధాన కార్యదర్శిగా రెండు సార్లు పనిచేసిన నేను సభ్యుడిగా అనేక పర్యాయాలు పనిచేశారు. కేయూలో అప్పట్లోనే ఉన్న ఆంధ్ర ప్రాంతీయుల వివక్ష, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ప్రొఫెసర్ జయశంకర్, భూపతి కృష్ణమూర్తితో కలిసి 1986లో నవంబర్ 1న విద్రోహదినం కూడా పాటించాం. టీడీపీ ప్రభుత్వం వచ్చాక 1994లో ఓయూకు చెందిన ప్రొఫెసర్ వైకుంఠంను కేయూ వీసీగా నియమిస్తే కేయూ అధ్యాపకులను నియమించకపోవడంపై ఆందోళనలు చేశాం.
 
ఆనాడే కేసీఆర్‌తో
టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. అదే సమయంలో ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావుతో పాటు పలువురు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. దీంతో అందరం కలిసి కేసీఆర్‌ను కలిసి తెలంగాణ ఆవశ్యకతను వివరించాం. ఆ తర్వాత కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను స్థాపిస్తే ప్రిసీడియం మెంబర్లుగా నేను, ప్రొఫెసర్ వెంకటనారాయణ, రేవతి, దినేష్‌కుమార్ వ్యవహరించాం.
 
2009 నుంచి జేఏసీ చైర్మన్‌గా
తెలంగాణ కేయూ విద్యార్థులు చేసిన ఉద్యమం మరువలేనిది. నేను 2009 నుంచి ఇప్పటి వరకు టీ జేఏసీ జిల్లా చైర్మన్‌గా కొనసాగుతున్నా. ఈ నేపథ్యంలో ఎన్నో ఉద్యమాలు, బలిదానాల అనంత రం తెలంగాణ ఏర్పడగా కేసీఆర్ సీఎం అయ్యా రు. ఉద్యమం సందర్భంగా ప్రజలు ఆశించినవన్నీ కేసీఆర్ చేస్తారని జేఏసీ చైర్మన్‌గా నమ్ముతున్నా.
 
కేయూకు పూర్వవైభవం తెస్తా..

కేయూలో ఒకప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులను చూస్తే బాధ కలుగుతోంది. అకడమిక్ పరంగానే కాకుండా అనేక విషయాల్లో సరిగ్గా లేదు. పలువురు పరిపాలన పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. ఫలితంగా యూనివర్సిటీ అంటే మేధావులు ఉంటారనే ప్రజల నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ మేరకు యూనివర్సిటీకి పూర్వవైభవం రావాలంటే విలువలు ఉన్న వీసీ రావాల్సిన అవసరముంది. ఈ విషయమై త్వరలోనే అధ్యాపకులతో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నాం.
 
ఏ అవకాశం ఇచ్చినా ఓకే..
ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ పొందుతున్నం దున ఇక నుంచి ఎక్కువ సమయం వీలు కుదురుతుంది. ప్రభుత్వం ఉన్నత విద్యలో సంస్కరణలు చేపట్టాలని యోచిస్తున్నందున నా వంతు సహకారం అందిస్తా. ఇప్పటికే కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న నాకు.. ప్రభుత్వం కావొచ్చు ఇంకా ఏదైనా కావొ చ్చు.. ఎలాంటి అవకాశం కల్పించినా నిర్వర్తించేం దుకు సిద్ధంగా ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని కుగ్రామమైన పవునూర్ నుంచి చదువురీత్యా 1970లోనే హన్మకొండ కు వచ్చి ఇక్కడ స్థిరపడిన నేను ఉద్యోగ విరమణ చేసినా ఇక్కడే ఉంటాను.
 
పదవులు - పరిశోధనలు
ప్రొఫెసర్ పాపిరెడ్డి కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్  విభాగాధిపతిగా 2004నుంచి 2006వరకు, బీఓఎస్‌గా 2006నుంచి 2008 వరకు, పరీక్షల నియంత్రణాధికారిగా 2006నుంచి 2009వరకు, కేయూ ఇన్‌చార్‌‌జ రిజిస్ట్రార్‌గా 2002నుంచి 2003వరకు పనిచేశారు. ఆయన పర్యవేక్షణలో ఎనిమిది మంది పీహెచ్‌డీలు, 8మంది ఎంఫిల్ పూర్తిచేయగా, మరో ఐదుగురు పీహెచ్‌డీ, మరో ఇద్దరు ఎంఫిల్ చేస్తున్నారు. ఐదు పుస్తకాలు, 13 జర్నల్స్ ప్రచురించిన పాపిరెడ్డి 15 పరిశోధన పత్రాలను వివిధ సదస్సుల్లో సమర్పించారు. నాలుగు మైనర్, రెండు మేజర్ ప్రాజెక్టులు పూర్తిచేసిన ఆయన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్, ఇండియన్ లేబర్ ఎకనామిక్ అసోసియేషన్, ఇండియన్ అగ్రికల్చరల్ ఎకనామిక్ అసోసియేషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ పొలిటికల్ ఎకనామి అసోసియేషన్లలో లైఫ్‌టైమ్ మెంబర్‌షిప్ కలిగి ఉన్నారు.

మరిన్ని వార్తలు