‘కృష్ణా’ర్పణం! | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’ర్పణం!

Published Mon, Jun 30 2014 3:25 AM

‘కృష్ణా’ర్పణం! - Sakshi

కర్నూలులో బోర్డు ఏర్పాటుకు అధికార పార్టీ మోకాలడ్డు
- విజయవాడలో ఏర్పాటుకు కోస్తా నేతల కుట్ర
- అదే జరిగితే హంద్రీనీవాకు తాళమే...
- తెలుగుగంగ, కేసీ, ఎస్‌ఆర్‌బీసీల కింద సాగుకు కష్టకాలం
- మేల్కొనని సీమ ప్రాంత ప్రజాప్రతినిధులు
కర్నూలు(రూరల్):
కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణ బోర్డు ఏర్పాటు వివాదాలకు తెర లేపుతోంది. రాష్ట్ర పునర్విభజన బిల్లులో సూచించిన విధంగా జూన్ 2వ తేదీ తర్వాత 60 రోజుల్లో బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టులకు నీరిచ్చేందుకు ఉద్దేశించిన బోర్డు ఏర్పాటుకు కర్నూలు అనుకూలమైన ప్రాంతమని నీటిపారుదల శాఖ అధికారులు కేంద్ర జల వనరుల శాఖకు నివేదిక అందజేశారు.

ఇందుకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నీటి పారుదల శాఖ నిపుణులు, ఉన్నతాధికారులు సైతం మద్దతిచ్చారు. అయితే కర్నూలులో ఏర్పాటైతే కృష్ణా డెల్టాలోని ఆయకట్టులో నారుమళ్ల సాగుకు కష్టాలు తప్పవని.. ఆంధ్ర ప్రాంతానికి నష్టం చేకూరుతుందనే భావనతో అధికార పార్టీకి చెందిన కోస్తా నేతలు బోర్డును విజయవాడలో ఏర్పాటు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో శ్రీశైలం జలాశయం అతి పెద్దది. ప్రాజెక్టులో 854 అడుగులకు పైగా నీరు ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమకు సాగునీటిని అందించే కాల్వలకు కృష్ణా జలాలను వినియోగించుకునే వీలుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు 848 అడుగుల నీటి మట్టం వరకు నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించారు. 834 అడుగుల వరకు నీరుంటే కృష్ణా డెల్టాకు నీరందించే వీలుంటుంది. అంతకంటే దిగువకు నీటి మట్టం చేరుకుంటే నీటి విడుదలకు వీలుండదని గతంలో హైకోర్టు స్పష్టం చేసింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పర్యవేక్షణకు యాజమాన్య బోర్డు విజయవాడలో ఏర్పాటు చేస్తే నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగుల నుంచి 854 అడుగుల దిగువకు పరిమితం చేయనున్నారు. అయితే 854 అడుగులకు పైబడి నీరుంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరందనుండటంతో భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది.

ఇదే జరిగితే రాయలసీమ ప్రాంతానికి కనీసం చుక్క నీరందని పరిస్థితి నెలకొంటుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలు చోటు చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్రాలు కలిసుండగానే ఆర్డీఎస్, సుంకేసుల డ్యాం, కేసీ కెనాల్, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులవిషయంలో జల వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇక కృష్ణా బోర్డు విజయవాడకు తరలిపోతే కొత్త వివాదాలు తప్పవని నీటి పారుదల శాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
హంద్రీనీవాకు తాళం
 కర్నూలులో బోర్డు ఏర్పాటైతేనే వరద జలాల ఆధారంగా నిర్మితమైన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీరందే అవకాశం ఉంటుంది. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు సాగునీటి విషయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతుల్లేవు. ఈ పరిస్థితుల్లో బోర్డు విజయవాడలో ఏర్పాటైతే అనుమతులను అడ్డుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా అనంతపురం జిల్లాకు అధిక నష్టం చేకూరనుంది. సాగునీటి ప్రాజెక్టుల నీటి వినియోగ పర్యవేక్షణకు సంబంధించిన బోర్డును నిబంధనల ప్రకారం ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంది.

తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఏర్పాటైన టీబీ బోర్డు కర్ణాటకలో ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. అయితే ఎలాంటి అధ్యయనం చేయకనే కృష్ణా బోర్డును విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నివేదిక పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమా ఉండడంతో బోర్డు ఆ ప్రాంతానికే తరలిపోవచ్చనే చర్చ జరుగుతోంది

Advertisement
Advertisement