-

తెలంగాణలో వడగాడ్పులు

25 Feb, 2016 04:40 IST|Sakshi
తెలంగాణలో వడగాడ్పులు

40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
నిజామాబాద్, మెదక్‌లో ఉష్ణ తీవ్రత
ఐఎండీ హెచ్చరిక
చరిత్రలో ఇదే ప్రథమం అంటున్న నిపుణులు

 సాక్షి, విశాఖపట్నం: చలికాలం వెళ్లకుండానే వేసవితాపం పెల్లుబుకుతోంది. రికార్డులను తిరగరాస్తూ ఫిబ్రవరిలోనే వడగాడ్పుల పరిస్థితి తలెత్తుతూ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొద్దిరోజులుగా ఉష్ణతీవ్రత పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు మరింత పెరిగి 40 డిగ్రీలకు పైగానే నమోదవుతోంది. తాజాగా తెలంగాణలోని నిజామాబాద్‌లో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. అలాగే మెదక్, రాయలసీమలోని అనంతపురంలోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, ఆదిలాబాద్, నంద్యాల, కర్నూలులో 39 డిగ్రీలు రికార్డవుతున్నాయి. వాస్తవానికి వేసవిలో సాధారణ ంకంటే 6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులని వాతావ రణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.

ఇప్పుడు అనూహ్యంగా ఆరేడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి. దీంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రానున్న 24 గంటల్లో నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. ఫిబ్రవరిలో వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేయడం దేశ వాతావరణ చరిత్రలో ఇదే ప్రథమమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి అసాధారణ పరిస్థితులని స్పష్టం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చే రే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగడమే తప్ప తగ్గవని అభిప్రాయపడుతున్నారు.

 కోస్తాంధ్రపై కాస్త కరుణ..
తెలంగాణ, రాయలసీమలపై భానుడు ప్రతాపం చూపుతుంటే కోస్తాంధ్రపై మాత్రం కాస్త కరుణిస్తున్నాడు. అక్కడ సాధారణ ంకంటే ఒకట్రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో అక్కడ ప్రస్తుతానికి వేసవి తాపం ఇంకా కనిపించడం లేదని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. .

మరిన్ని వార్తలు