ఓఆర్‌ఆర్‌ ‘గ్రోత్‌’కు నవశక్తి

5 Nov, 2019 11:57 IST|Sakshi

హెచ్‌జీసీఎల్‌ చైర్మన్‌గా హరిచందన దాసరి

పూర్తి అదనపు బాధ్యతలుఅప్పగిస్తూ ఉత్తర్వులు

చైర్మన్‌ దృష్టి సారిస్తే గ్రిడ్‌ రోడ్లు పట్టాలెక్కే అవకాశం

సాక్షి,సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డులో అభివృద్ధి పనులతో పాటు గ్రోత్‌ కారిడార్‌ (గ్రిడ్‌ రోడ్లు, రేడియల్‌ రోడ్ల అనుసంధానం) పనులు వేగవంతం కానున్నాయి. ఆయా పనులను పట్టాలెక్కించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు ప్రారంభించింది. ఈ పనులను పర్యవేక్షించే ‘హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌’ (హెచ్‌జీసీఎల్‌)కు చైర్మన్‌గా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా అర్వింద్‌కుమారే కొనసాగుతున్నారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కూడా ఆయనే ఉన్నారు. పలు విభాగాల బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆయనపై పనిభారం పెరిగింది. దీంతో గ్రోత్‌ కారిడార్‌ పనులను పరుగులు పెట్టించేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌గా ఉన్న హరిచందన దాసరికి హెచ్‌జీసీఎల్‌ చైర్మన్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం అర్వింద్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

ఓఆర్‌ఆర్‌పై ఫోకస్‌ పెట్టాల్సిందే..
హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా హరిచందన చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. సుమారు 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఇంజినీరింగ్‌ పనులపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ మార్గంలో వాహనాల రద్దీ విపరీతంగా ఉండడంతో ప్రస్తుతమున్న 19 ఇంటర్‌ చేంజ్‌లకు తోడు మరికొన్నింటిని ఏర్పాటు చేసేందుకు గతంలో అధికారులు చేసిన ప్రయత్నాలను కార్యరూపంలోకి తేవాల్సి ఉంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ మార్గంలో వాహనాల రద్దీ ఉండడంతో ఆ మార్గంలోనే ఉన్న నార్సింగ్‌ వద్ద మరో ఇంటర్‌ చేంజ్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ పనులను సైతం యుద్ధప్రాతిపదికన పట్టాలెక్కించాలి. దీన్ని ఆచరణలోకి తెస్తే ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, ఓఆర్‌ఆర్‌ మార్గంలోని సర్వీసు రోడ్ల వద్ద విలేజ్‌ అండర్‌ పాస్‌లను నిర్మించాల్సిన అవసరముంది. ఆ దిశగా హెచ్‌జీసీఎల్‌ చైర్మన్‌గా హరిచందన దృష్టి సారించాలి. 

పట్టాలెక్కని గ్రిడ్‌ రోడ్లు  
ఓఆర్‌ఆర్‌ గ్రోత్‌ కారిడార్‌లో అతిముఖ్యమైన గ్రిడ్‌ రోడ్ల నిర్మాణ పనులు ఎన్నో ఏళ్లుగా మరుగున పడిపోయాయి. 2008లో మాస్టర్‌ ప్లాన్‌ గ్రోత్‌ కారిడార్‌ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఇరువైపులా దాదాపు 718 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్‌ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. కానీ పనులు మాత్రం పట్టాలెక్కలేదు. సర్వీస్‌ రోడ్లతో పాటు ఇంటర్‌ చేంజ్‌లతో అనుసంధానం చేస్తూ ఈ రహదారులను అభివృద్ధి చేస్తే ట్రాఫిక్‌ రద్దీ ఉండదని, అందుకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం–హయత్‌నగర్, మహేశ్వరం–శంషాబాద్‌– ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌–శంషాబాద్‌–మొయినాబాద్‌–శంకర్‌పల్లి,  రామచంద్రపురం–శంకర్‌పల్లి–పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌–శేరిలింగంపల్లి–రామచంద్రపురం–జిన్నారంగ్రిడ్‌ రోడ్లను అభివృద్ధి చేయాలని గుర్తించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. వీటిని నిర్మించినట్టయితే నగరంపై ట్రాఫిక్‌ ఒత్తిడి పూర్తిగా తగ్గి శివార్లలో అభివృద్ధి వేగం పుంజుకొనే అవకాశముంది. మేడ్చల్, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్, పటాన్‌చెరు ప్రాంతాలను అనుసంధానం చేస్తే ఆయా ప్రాంతాలు మినీ పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయి.  

మరిన్ని వార్తలు