నాలుగున్నరేళ్ల కోర్సు.. 5 ఏళ్లకు ఫీజా? 

11 Jan, 2020 01:02 IST|Sakshi

తెలంగాణలో మెడికల్‌ ఫీజుల వసూళ్లను తప్పుబట్టిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ ఫీజుల వసూలు విధానాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇష్టానుసారంగా ఫీజు వసూళ్లు చేయడానికి వీల్లేదని, వైద్య కోర్సుల కాలానికి తగ్గట్టుగానే ఫీజులు ఉండాలని తేల్చిచెప్పింది. ఫీజుల విషయంలో తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కాలేజీ యాజమాన్యాలకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేయడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. వైద్య (ఎంబీబీఎస్‌) కోర్సు నాలుగున్నరేళ్లయితే ఐదేళ్లకు ఫీజులెలా వసూలు చేస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వం జీవో నం.120, ఏపీ ప్రభుత్వం జీవో నం.30లను జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ వరంగల్‌కు చెందిన మైనర్‌ డి.పద్మతేజ 2018లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది.

తెలంగాణ జీవో వరకే: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో వరకే తీర్పు వెలువరిస్తున్నామని, ఏపీ ప్రభుత్వ జీవో చట్టబద్ధత జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్‌ లేవనెత్తిన ఫీజుల అంశానికి మాత్రమే తీర్పు పరిమితం చేస్తున్నామని, ఇతర అంశాల్లోకి వెళ్లడం లేదని వివరించింది. ఫీజుల నిర్ణయం చేసేప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సంఘాలను ప్రభుత్వం/టీఏఎఫ్‌ఆర్‌సీలు పట్టించుకోలేదని ఆక్షేపించింది. వైద్య కోర్సు నాలుగున్నరేళ్లకే ఫీజు వసూలు చేయాలని ఆదేశించింది.

నాలుగున్నరేళ్లకే ఫీజు వసూలు చేయాలని 2017లో ఇచ్చిన జీవో నం.120 ప్రకారమే ఫీజుల వసూళ్లు ఉండాలని, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజీ యాజమాన్యాల సంఘంలోని కాలేజీలు ఐదేళ్ల ఫీజులు వసూలు చేస్తే ఏపీ విద్యా సంస్థల చట్టం కింద చర్యలు తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. ప్రైవేటు మెడికల్‌ డెంటల్‌ కాలేజీలకు 5 సంవత్సరాలకు ఫీజు వసూలుకు అనుమతివ్వడం చెల్లదని తేల్చింది.

మరిన్ని వార్తలు