ఆ భవనాలు కూల్చొద్దు : హైకోర్టు

8 Jul, 2019 13:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ కూల్చివేత- అసెంబ్లీ నూతన భవన నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకు ఎర్ర మంజిల్‌ భవనాలను కూల్చవద్దని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం స్పష్టం చేసింది.  ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పిటిషన్‌ విచారణ సందర్భంగా తొలుత కౌంటర్‌కు గడువు కోరిన ప్రభుత్వ లాయర్‌.. తర్వాత ఈరోజు మధ్యాహ్నమే తమ వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

కాగా ప్యాలెస్‌ అనుమతి లేకుండా ఎర్రమంజిల్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ నవాబు వారసులు హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఎర్రమంజిల్‌లో ఉన్న 12 ఎకరాల భూమికి పరిహారం చెల్లించాలని కోరారు. 1951 నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో... తుదితీర్పు వెలువడకముందే అసెంబ్లీ భవనాన్ని ఎలా నిర్మిస్తారని పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణం చేపట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సామాజిక వేత్త పాడి మల్లయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఇక చరిత్రాత్మక ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు