ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంపు!

27 Jul, 2017 00:27 IST|Sakshi

► ఎస్సీలకు 16%, ఎస్టీలకు 9%
►  జనాభా ప్రాతిపదికన ప్రతిపాదనలు రూపొందించిన యంత్రాంగం
► సానుకూలంగా ఉన్న సీఎం.. త్వరలో ఉత్తర్వులు


సాక్షి, హైదరాబాద్‌: షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. జనాభా ప్రాతిపదికన ఈ వర్గాల రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జనాభా లెక్కల ఆధారంగా అధికారులు రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల జనాభా శాతంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. ఇందులో ఎస్సీ జనాభా 54.08 లక్షలు, ఎస్టీ జనాభా 31.77 లక్షలుగా ఉంది.

ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలోనూ రిజర్వేషన్ల పెంపుపై ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. రిజర్వేషన్ల పెంపుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు అతి త్వరలో ఆమోదం లభించనున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీలకు తాజాగా 4 శాతం రిజర్వేషన్లు పెరగనుండడంతో రిజర్వేషన్ల కోటా 54 శాతానికి చేరుకోనుంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

కొత్త నోటిఫికేషన్ల నాటికి..
ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగిరం చేస్తోంది. దీంతో ఆయా వర్గాలు నష్టపోతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. త్వరలో వెలువడే నోటిఫికేషన్లకు కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా రిజర్వేషన్లు పెంచాలనే యోచనలో ఉంది.

మరిన్ని వార్తలు